పరస్పర సహకారం..అభివృద్ధికి సోపానం
పరస్పర సహకారం వల్లనే అభివృద్ధి జరుగుతుందని తాను నమ్ముతున్నానని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆసియా ఖండంలోని దేశాలతో బహుళ విభాగాల్లో సంబంధాల విస్తరణకు భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. థాయ్‌లాండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ,,బ్యాంకాక్‌లో జరిగిన 16వ ఆసియాన్ - భారత్ సదస్సుకు హాజరయ్యారు. తీర ప్రాంత రక్షణ సహా వ్యవసాయం, ఇంజినీరింగ్, డిజిటల్ సాంకేతికత, పరిశోధన రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పలు అంశాల్లో ఆసియాన్ కూటమిలోని సభ్య దేశాలతో కలిసి సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు మోదీ.
ఇండో-ఫసిఫిక్ ప్రాంతానికి సంబంధించి పరస్పర సహకారంపై కూటమి దేశాలు, భారత్ ఏకాభిప్రాయంతో ఉండటాన్ని స్వాగతించారు ప్రధాని. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న భారత్ కల త్వరలోనే సాకారం అవుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సరికొత్త మార్పుల దిశగా భారత్ అడుగులు వేస్తోందని తెలిపారు. బ్యాంకాక్‌లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూప్ స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని మోదీ పెట్టుబడి దారులకు పిలుపునిచ్చారు.
బ్యూరోక్రటిక్ తరహా పాలనకు స్వస్తి పలికి, నవ భారతం దిశగా దేశం అడుగులు వేస్తోందని చెప్పారు. థాయ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్ చాన్ ఓ చాన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో.. మయన్మార్ కౌన్సిలర్ అంగ్‌సాన్ సూకీ తోనూ సమావేశమయ్యారు. అనంతరం మోదీకి అపూర్వమైన రీతిలో విందు ఏర్పాటు చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి