దొరా కరుణించు..కార్మికులను రక్షించు
ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఊరుమ్మడి ఉంపుడుకత్తెగా చెలామణి అయ్యింది. అస్మదీయులకు, పదవుల పంపకానికి కేరాఫ్ గా ఉపయోగ పడింది. రెండు మూడు పర్మిట్లు మాత్రమే తీసుకుని వందలాది వాహనాలు నడిపిస్తూ రాజ్యమేలిన వారు దర్జాగా కాలరెగరేసుకుని తిరిగారు. కోట్లాది ఆస్తులను కలిగిన ఈ అక్షయపాత్రను ఆధారంగా చేసుకుని కోట్లు వెనకేసుకున్నారు. తమ పేరు మీద, తమకు చెందిన వారి పేరు మీద దొడ్డి దారిన ఆర్టీసీ లోకి ఎంటర్ అయ్యారు. ప్రైవేట్ బస్సులు నడుపుతూ సంస్థ ఆదాయానికి గండి కొట్టారు.
చివరకు పాత బస్సులను సైతం అమ్ముకున్నారు. పాడై పోయిన బస్సుల టైర్లను లోపాయికారీగా అమ్మేసుకుని పోగేసుకున్నారు. వారిలో ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన అన్ని పార్టీలకు చెందిన వారే కాకుండా మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కూడా ఉన్నారు. ఇదే సమయంలో కింది స్థాయి అంటే మెకానిక్ లు, కండక్టర్లు, డ్రైవర్లను పై, స్థాయిలో పని చేసిన ఆంధ్రేతర అధికారులు వేధింపులకు పాల్పడ్డారు. ఇందులో ప్రధాన పోస్టుల్లో వీరే తిష్ట వేసుకుని కూర్చున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది అగ్ర భాగాన నిలిచారు.
నెల రోజుల పాటు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమంలో కార్మికులు భాగం పంచుకున్నారు. వీరు చేసిన ప్రయత్నం ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ఎందరో బలిదానాలు చేసుకున్నారు. కేసీఆర్ సీఎం పీఠంపై కొలువుతీరిండు. బతుకులు బాగు పడుతాయని భావించారు..నమ్మారు. కానీ అధికారం చేతుల్లోకి వచ్చేసరి కల్లా కార్మికులకు చుక్కలు చూపించారు. దీంతో తిరిగి తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు. 21 మంది తట్టుకోలేక అసువులు బాశారు. అయినా మన పెద్దాయన చలించలేదు. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ స్పష్టం చేశారు.
ఎదిరించారు..బెదిరించారు..చివరకు డెడ్ లైన్ విధించారు. పోలీసులు తమ ప్రతాపాన్ని చూపించారు. కార్మికులని కూడా చూడలేదు. ఈడ్చుకు వెళ్లారు. అరెస్టులు చేశారు. అయినా బాధితులు వెనుతిరిగి చూడలేదు. ప్రాణాలు పోయినా విరమించ బోమంటూ తేల్చి చెప్పారు. ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఇంకో వైపు ప్రైవేట్ పరం చేసేందుకు తలుపులు తెరిచారు సీఎం. ఇంకేం ఒక్క సంతకంతో కొన్ని తరాలుగా కాపాడుకుంటూ వచ్చిన ఆర్టీసీని ముక్కలు చేశారు. 5100 పర్మిట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అత్యున్నత ధర్మాసనం పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆపై మొత్తం సమస్యను కేంద్రం పై నెట్టేశారు.
ఆపై కార్మికుల చావులకు ప్రతిపక్షాలే బాధ్యత వహించాలని అన్నారు కేసీఆర్. ఆర్టీసీ సమస్యపై ఓ వైపున కోర్టు ప్రభుత్వాన్ని, ఉన్నతాధి కారులను మెట్టి కాయలు వేసింది. తీవ్రంగా మందలించింది. మరో వైపు రాష్ట్ర గవర్నర్ ఈ విషయంపై ఆరా తీశారు. కానీ ఇవేవీ పట్టించు కోవడం లేదు. ఇప్పటి కైనా మనసు మార్చు కోవాలని, పెద్ద మనసు చేసుకుని పది కాలా పాటు పట్టెడన్నం పెట్టిన ఆర్టీసీని, బడా బాబులకు అప్ప చెప్పకుండా కార్మికులే నడిపించేలా చేయాలనీ ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రజలు కోరుతున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి