చర్చలకు సిద్ధం..బెదిరిస్తే భయపడం
ఆర్టీసీ సీఎం కేసీఆర్ జాగీర్ కాదు. అయన మమ్మల్ని అపాయింట్ చేయలేదు. మమ్మల్ని డిస్మిస్ చేసే అధికారం ఆయనకు లేదు. బెదిరిస్తే భయపడతామని అనుకుంటున్నారు. మట్టిని నమ్ముకున్నాం. కస్టపడి సంస్థను కాపాడుకుంటూ వస్తున్నాం. అప్పనంగా ఎగరేసుకు పోతానంటే ఒప్పుకోమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికులను బెదిరించే ధోరణి మానేసి ఇప్పటికైనా చర్చలకు సిద్ధం కావాలని కోరారు. చర్చలకు ఆహ్వానిస్తే ఏయే డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరిస్తుందో, ఏయే డిమాండ్ల విషయంలో జేఏసీ పట్టు విడుపులను ప్రదర్శిస్తుందో స్పష్టమవుతుందని, అది ఆర్టీసీ సమ్మెకు పరిష్కారంగా మారుతుందని పేర్కొంది.
కేసీఆర్ఈ డెడ్ లైన్ విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిని కార్మికులు పట్టించు కోరని తేల్చి చెప్పింది. తమ డిమాండ్లు పరిష్కారం కానంత వరకు సమ్మెను ఆప బోమని స్పష్టం చేసింది. ఆర్టీసీలో 5,100 మార్గాలను ప్రైవేట్‌కు కేటాయించటం చట్ట విరుద్ధమన్నారు. పరిష్కార మార్గాలు చూపనంత వరకు సమ్మెను ఆపబోమని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటీకరించాలన్న రహస్య ఎజెండాను మనసులో పెట్టుకుని ముఖ్యమంత్రి కార్మికులను భయ భ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం బెదిరింపులకు కార్మికులెవరూ భయపడొద్దని, 49 వేల మంది ఉద్యోగాలు తొలగించే హక్కు ఎవరికీ లేదని పేర్కొన్నారు.
ఇప్పటికే ఖరారు చేసిన సమ్మె కార్యాచరణ అలాగే కొనసాగుతుందన్నారు. ఒకవైపు బిడ్డలు అంటూనే మరోవైపు కార్మికులను రెచ్చ గొట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఏదో ఓ కమిటీ వేసి తమ డిమాండ్లపై చర్చించాలని పేర్కొన్నారు. చర్చల్లో పట్టు విడుపులకు అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో లీగల్ లేదు ఇల్లీగల్ లేదు, సమ్మె సమ్మెనే అన్న కేసీఆర్, తెలంగాణ వచ్చాక సమ్మె విషయంలో మాట మార్చడం సబబు కాదన్నారు. ఆర్టీసీకి బకాయిలు లేవు అనటం కూడా సరికాదని, దానిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తే నిజాలు వెలుగు చూస్తాయన్నారు.
కేవలం 5 వేల బస్సులే ఆర్టీసీలో ఉంటాయన్న ముఖ్యమంత్రి లెక్కల ప్రకారం 28 వేల మంది కార్మికులు సరి పోతారని, మరి మిగిలిన 23 వేల మందికి పని ఉండదని, వారిని కూర్చోబెట్టి జీతాలిస్తారా అని ప్రశ్నించారు. 97 డిపోలకు గాను 48 డిపోలే సరి పోతాయని, మిగిలిన డిపోల డీఎంల పరిస్థితి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా డీఎంల నుంచి ఈడీల వరకు బయటకొచ్చి తమతో కలసి సమ్మె చేయాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం రిజర్వేషన్ రోస్టర్ అమలు ఆర్టీసీలో పక్కాగా జరుగుతోందని, సగం రూట్లను ప్రైవేటీకరించాక వచ్చే ప్రైవేటు సంస్థలు వాటిని అమలు చేస్తాయా అని ప్రశ్నించారు. ఆర్టీసీలో 650 కోట్ల డిప్రిసియేషన్ ఫండ్ ఉంటుందని, అది ఎక్కడుందో తేల్చి దానితో కొత్త బస్సులు కొనాలని సూచించారు. రోడ్డు దిగ్బంధం కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నామని, ఆ రోజు న్యాయస్థానాలకు సంబంధించిన పోస్టుల భర్తీ పరీక్ష ఉన్నందున, అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని అశ్వత్థామ చెప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి