పొదుపు భవిష్యత్..కు మలుపు
కదిలే కాలంలో జీవన ప్రయాణం మరింత కష్టంగా మారింది. బతకాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నెలకు కనీసం వేళల్లో డబ్బులు రావాలి. లేకపోతే జీవించడం కష్టమవుతుంది. ఉన్నదంతా తినేందుకు సరిపోతే ఇక దాచు కోవడం ఎట్లా అన్నది ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య. తెలివి, అర్హత ఉన్నా చేసేందుకు పని దొరకడం లేదు. కేంద్రంలో బీజేపీ కొలువు తీరాక మరింత తీవ్ర రూపం దాల్చింది నిరుద్యోగం. మనుషులకు భద్రత లేకుండా పోయింది. అంతటా బాధ్యతా రాహిత్యమే రాజ్యమేలుతోంది. దీంతో దినదిన గండం అర్ధాయుస్సు అన్నట్టుగా తయారైంది. సంపాదించిన దాంట్లో కొద్దిగా దాచుకుంటే కొంత మేలు జరిగే అవకాశం ఉంది.
లేక పోతే కస్టాలు కొని తెచ్చుకున్న వారవుతాం. ఇవ్వాళ కొద్ది మొత్తంలో దాచుకున్న డబ్బులు రేపు పెద్ద మొత్తంలో జమ అవుతాయి. అవే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాయి. కష్టాల్లో ఉన్నప్పుడు భరోసా కలుగ చేస్తాయి. ఇండియాలో ఎక్కువగా పొదుపు చేసే అలవాటు మహిళల్లోనే ఉంటోంది. పొదుపు సంఘాలు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఈ మేరకు పొదుపుపై ఓ సంస్థ సర్వే చేపట్టింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడానికే 58 శాతం మంది మహిళలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది. లేదంటే బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో డబ్బులు దాచుకుంటున్నారు. ఆన్‌లైన్ వేదికగా ఆర్థిక సేవలు అందించే స్క్రిప్ బాక్స్ సర్వే ద్వారా ఈ వివరాలు తెలిశాయి.
మరో 6 శాతం మంది మహిళలు బంగారం కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పడం గమనార్హం. అదనపు ఆదాయాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా పెడతామని 15 శాతం మగువలు చెప్పారు. ప్రముఖ ఫేస్ బుక్ కమ్యూనిటీల ఆధారంగా 400 మంది మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ వివరాలు వెల్లడించింది. మిలీనియల్స్‌లో మూడొంతులు మంది పొదుపు పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. విహార యాత్రల కోసం డబ్బును పక్కన పెడుతున్నారు. నాన్ మిలీనియల్స్ మహిళల్లో సగం మంది రిటైర్మెంట్ నిధి, పిల్లల విద్య కోసం కొంత మేర దాస్తున్నారు. పన్ను ఆదా చేసే పీపీఎఫ్, ఎల్‌ఐసీ పథకాలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ప్రాముఖ్యంగా ఉన్నాయి.
నాన్ మిలీనియల్స్‌లో 33 శాతం మంది వీటికే ఓటేశారు. 26 శాతం మంది మాత్రం దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధనకు మ్యూచువల్ ఫండ్స్ సాయపడతాయని చెప్పారు. అవసరమైన సందర్భాల్లో తమ కష్టార్జితాన్ని సులభంగా, వెంటనే పొందే వెసులు బాటు ఉండాలని సర్వేలో పాల్గొన్న మహిళల్లో 44 శాతం మంది పేర్కొన్నారు. అత్యవసర నిధికి ఎక్కువ మంది మొగ్గు చూపారు. పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం అనేవి నాణేనికి రెండు ముఖాలు. కానీ వీటి మధ్య చాలా పెద్ద వ్యత్యాసమే ఉంది.
అత్యవసరాల కోసం డబ్బులను పక్కన పెట్టుకోవడం పొదుపు అవుతుంది. దీనిపై రాబడులు నామ మాత్రం గాను లేదా అసలు రాక పోవచ్చు. కానీ పెట్టుబడులు అనేవి సంపదను సృష్టించు కునేందుకు క్రమ బద్ధమైన విధానం. ద్రవ్యోల్బణాన్ని మించి నికర విలువ వృద్ధి చెందేందుకు, పిల్లల విద్య, రిటైర్మెంట్ అవరాల కోసం నిధిని సమ కూర్చు కునేందుకు మార్కెట్ ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు తోడ్పడతాయి అని ఆర్థికరంగ నిపుణులు సూచిస్తున్నారు. సో..ఇప్పటికైనా కాసింత నైనా జమ చేయడం అలవాటు చేసుకోవాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి