మరాఠాలో కలవని కత్తులు
మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ, శివసేన పార్టీల మధ్య మరింత దూరం పెరుగుతోంది. సీఎం కుర్చీని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే స్పష్టం చేశారు. రెండున్నర ఏళ్ళు తమకు అధికారం ఇవ్వాల్సిందేనని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ తమ పార్టీకి ఉందన్నారు. తమ షరతుకు ఒప్పుకోక పోతే బీజేపీతో కలిసి ముందుకు సాగడం సాధ్యం కాదన్నారు. తాము లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడి మెజారిటీ నిరూపించు కోవడంలో బీజేపీ విఫలమైతే రెండో పెద్ద పార్టీగా తామే ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీని కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో పేర్కొంది.
కేబినెట్ పదవులతో పాటు, సీఎం పదవిని కూడా సమానంగా పంచు కోవాలని శివసేన డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా రెండో సారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఫడ్నవిస్ తమ సీఎం అని బీజేపీ అధిష్టానం తెలిపింది. దీంతో ఇరు పార్టీలు పంతానికి పోవడంతో మాహా ప్రతిష్టంభన నెలకొంది. ఎన్‌సీపీ, కాంగ్రెస్, ఇతురలతో కలిసి మా సంఖ్యా బలం 170కి చేరుకుంది. మరో అయిదు కూడా పెరిగే ఛాన్స్ ఉందని వెల్లడించారు ఉద్దవ్.
శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ సిద్ధాంతాలు వేరైనా ప్రభుత్వాన్ని సమన్వయంతో నడిపేందుకు అవసరమైన ప్లాన్‌తో ముందుకు వెళతామన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరహా లోనే తాము కూడా అందర్నీ కలుపుకొని వెళ్తామని చెప్పారు. మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఇందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. మొత్తం మీద పీటముడి ఇంకా వీడలేదు. సమస్య కొలిక్కి రాలేదు. డెడ్ లైన్ దగ్గర పడుతోంది. ఎవరు అధికారాన్ని చేజిక్కించుకుంటారోనని జనం ఉత్కంఠకు లోనవుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి