కూనలు భళా..పులులు డీలా
నిన్నటి దాకా తమకు ఎదురే లేదని ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియాకు కూనలుగా భావించిన బంగ్లాదేశ్ జట్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. పేలవమైన బ్యాటింగ్, పదును లేని బౌలింగ్ తో భారత్ తొలిసారి టి20 మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో బోల్తా పడింది. ఢిల్లీలో జరిగిన ఈ ఆటలో బంగ్లా టీమిండియాను ఉక్కిరి బిక్కిరి చేసింది. తొమ్మిదో ప్రయత్నంలో తొలిసారి ఇండియాను వారి సొంత గడ్డపైనే ఓడించి సగర్వంగా నిలిచింది. షకీబ్, తమీమ్ లాంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే ఆ జట్టు ప్రదర్శించిన స్ఫూర్తి దాయక ఆటతో భారత్‌కు నిరాశ తప్పలేదు.
ఏ దశలోనూ బ్యాటింగ్‌లో దూకుడు కనబర్చని రోహిత్ సేన ఆ తర్వాత ప్రత్యర్థిని నిలువరించడంలో పూర్తిగా విఫలమైంది. సీనియర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ అడ్డు గోడలా నిలిచి జట్టును గెలిపించాడు. టాస్ ఓడి ముందుగా టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 42 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇదే జట్టులో అత్యధిక స్కోరు. మన బ్యాటింగ్ దిగ్గజాలు ఉన్నా ఫలితం లేక పోయింది. అందరూ పెవిలియన్ బాట పట్టారు.
అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. స్కోరు సమమైనపుడు కెప్టెన్ మహ్ముదుల్లా సిక్సర్‌తో బంగ్లాదేశ్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. ముష్ఫికర్ రహీమ్ 43 బంతుల్లో 60 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా సౌమ్య సర్కార్ 35 బంతుల్లో 39 పరుగులు చేసి మూడో వికెట్‌కు 55 బంతుల్లో 60 పరుగులు జోడించి గెలుపులో కీలక పాత్ర పోషించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి