ఇదేనా కోరుకున్న తెలంగాణా..?

 తెలంగాణా మరోసారి తన అస్తిత్వం కోసం ఎదురు చూస్తున్నది. తెలంగాణా అంటేనే మహత్తరమైన చరిత్ర. విస్మరించలేనటువంటి ఘనమైన వారసత్వం కలిగి ఉన్నది. దీనిని తేలిగ్గా తీసుకోలేం..తీసి పారేయటానికి ఇదేదో నమీబియానో లేదా ఇథియియోపియానో కాదు. ప్రగతి శీలత కలిగిన, బుద్ది జీవులు, మేధావులు, కవులు, కళాకారులు, నిబద్దత కలిగిన సమూహంతో పాటు, బలిదానాలు, త్యాగాలు, పోరాటాలు, ఉద్యమాలకు ఊపిరి పోసుకున్నది ఈ తెలంగాణ. అపారమైన వనరులు, అంతులేని జలవనరులు, సంపదత్వం కలిగిన ప్రాంతం ఇది. దీని గురించి చెప్పాలంటే పది దశాబ్దాలు సరి పోవు. సుదీర్ఘమైన పోరాటంతో, దోపిడీ, వివక్ష నుంచి విముక్తి కోసం చేసిన పోరాటం ప్రపంచ చరిత్ర గతినే మార్చి వేసింది. అంతటి ఘనమైన కథ ఉన్నది దీనికి. తెలంగాణ అంటేనే వెన్నులో వణుకు పుడుతుంది.

 
ఇక్కడ ఉన్నంత ఆత్మీయత, అనుబంధం, ఆథిత్యం ఇంకెక్కడా అగుపించదు. అందుకే తెలంగాణ అంటే ఎందరికో ఇష్టం..స్ఫూర్తి కూడా. లోకపు వాకిట నెత్తుటి సంతకం చేసిందీ తెలంగాణ. నివురు గప్పిన నిప్పులా, నింగిని చీల్చే మిస్సైల్ లా, నేలను ముద్దాడే ఆయుధంలా నిటారుగా నిలబడ్డది. దీనిని ముట్టుకోవాలని చూసిన వాళ్ళు నామ రూపాలు లేకుండా పోయారు. చరిత్ర గమనంలో ఎందరో హీరోలు కానీ కొందరే మహానుభావులుగా నిలిచి పోయారు. వారిలో తెలంగాణ తొలి .పొద్దు..దార్శనికుడు..స్ఫూర్తి శిఖరంగా కోట్లాది మంది కొలిచే జయశంకర్, కాళోజి, తదితరులు ఉన్నారు. సకల జనులంతా నీళ్లు, నిధులు, నియామకాల కోసం 14 ఏళ్లకు పైగా అలుపెరుగని పోరాటం చేశారు. దీని వల్లనే తెలంగాణ ఏర్పడ్డది. దేశ పటంలో తల ఎత్తుకుని నిలబడ్డది. మూడున్నర కోట్ల మంది సంతోషంలో మునిగి పోయారు.
 
మన బతుకుల్లో వెలుగులు వస్తాయని నమ్మారు. ఉద్యమ నేపథ్యం కలిగిన టీఅర్ఎస్ పార్టీగా అవతరించింది. కొత్త రాష్ట్రంలో కొలువు తీరింది. కానీ ఆశించిన రాష్ట్రం వచ్చిన కోరుకున్న ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు. దొంగలు, దొరలు ఒక్కటై ఎక్కడ పడితే అక్కడ దోచు కోవడం మొదలు పెట్టారు. ఎక్కడ చూసినా అవినీతి అనకొండలు బయట పడుతున్నారు. పోలీసుల ప్రతాపం మొదలైంది. నిధుల మాట దేవుడెరుగు..నియామకాల ఊసేలేదు. ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ సంస్థ ఈ రాష్ట్ర ప్రజలకు ఇతోధికంగా సేవలు అందజేస్తోంది. తమకు ఉద్యోగ భద్రత కావాలని కోరుతున్నారు. నష్టాల పేరుతో సర్కార్ ససేమిరా అన్నది. దీంతో వేలాది మంది రోడ్డెక్కారు.
 
కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. సెల్ఫ్ డిస్మిస్ అయ్యారన్న ఒకే ఒక్క మాట కార్మికుల్లో మరింత ఆందోళనకు నెట్టివేసింది. ప్రజాస్వామ్యంలో ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగంలో మాట్లాడటం, తమ అభిప్రాయాలను వ్యక్త పరచడం ప్రాథమిక హక్కు. దానిని కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. కార్మికులు మెట్టు దిగాలి..సర్కారు తన పంతం వీడాలి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యను పరిష్కరించేందుకు గవర్నర్ దృష్టి పెట్టాలి. లేకపోతే తెలంగాణ సమాజం క్షమించదు.

కామెంట్‌లు