ఆ రూపం అపురూపం..ఆమె జ్ఞాపకం మధురం..!
భారతీయ సినీ జగత్తులో మరిచి పోలేని జ్ఞాపకం మధుబాల. ఎంత చెప్పినా తక్కువే. తెలుగులో సావిత్రి..బాలీవుడ్ లో మధుబాల గొప్ప నటీమణులుగా పేరు తెచ్చుకున్నారు. 1933 లో పుట్టిన ఆమె 1969 లో మృతి చెందారు. 1950 ల నుండి 1960 కాలంలో ఆమె ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించారు. వీటిలో ఎక్కువ భాగం కావ్య స్థాయిని పొందాయి. తన సమకాలికులైన నర్గీస్, మీనా కుమారిలతో పాటు అత్యంత ప్రతిభావంతులైన హిందీ చిత్ర నటీమణులలో ఒకరిగా మధుబాల విస్తృత గౌరవాన్ని పొందారు. సాంప్రదాయ ముస్లిం దంపతుల పదకొండు మంది సంతానంలో ఈమె ఐదవ వ్యక్తి. ఇదే సమయంలో మధుబాల తండ్రి అతుల్లా ఖాన్ పెషావర్‌లోని ఇంపీరియల్ టొబాకో కంపెనీలో తన ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత తన కుటుంబాన్ని ముంబైకి మార్చారు. ముంతాజ్ తొమ్మిది సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు.మొదటి సారి నటించిన చిత్రం బసంత్ బాక్స్-ఆఫీస్ వద్ద విజయవంతమైంది. బాలనటిగా ఆమె అనేక చిత్రాలలో నటించడాన్ని కొనసాగించారు. నటీమణి దేవికా రాణి ఆమె నటనకు, సామర్ధ్యానికి ముగ్దులై ఆమెకు మధుబాల అనే పేరు పెట్టుకోమని సలహా ఇచ్చారు. మధుబాల త్వరగానే ఒక విశ్వసనీయమైన వృత్తి పరమైన నటిగా కీర్తిని సంపాదించుకున్నారు. యుక్త వయసులో ప్రధాన పాత్రల కొరకు శిక్షణ తీసుకున్నారు. నిర్మాత కిదార్ శర్మ ఆమెను రాజ్ కపూర్‌కి ప్రతిగా నీల్ కమల్ చిత్రంలో నటింప చేశారు. ప్రధాన పాత్ర ధరించినపుడు ఆమె వయసు పద్నాలుగు ఏళ్ళు. ఈ చిత్రం వాణిజ్య పరంగా విజయవంతం కాలేదు, అయితే ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. రెండు ఏళ్ళ తర్వాత మధుబాల ఆకర్షణీయమైన అందగత్తెగా ఎదిగారు. బోంబే టాకీస్ చిత్రం మహల్ లో ప్రధాన పాత్రను పోషించారు. అది బిగ్ హిట్. ఆ సమయంలో ఆమె వయసు 16 సంవత్సరాలే అయినప్పటికీ, నైపుణ్యంతో కూడిన నటన సహ నటుడు అశోక్ కుమార్‌ను ఆకర్షించింది.
మధుబాల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దానిని ఆమె దాచి పెట్టారు. వాసన్ చిత్రం బహుత్ దిన్ హుయే కోసం మద్రాస్‌లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె సెట్‌పై రక్తం కక్కుకున్నారు. ఆరోగ్య సమస్య కారణంగా మధుబాల కుటుంబం ఆమె పట్ల అత్యంత రక్షణతో ఉండేది. స్టూడియోలలో చిత్ర నిర్మాణం జరిగే సమయంలో, ఆమె ఇంటి-నుండి తెచ్చిన ఆహారాన్ని మాత్రమే తినే వారు, అంటురోగాల బారిన పడే అవకాశాలను తగ్గించడానికి ఒక బావి నీటిని మాత్రమే వాడేవారు. 1950 ప్రారంభంలో మధుబాల భారతదేశంలో అత్యంత అభిమానించే నటీమణులలో ఒకరిగా మారారు. ఆమె హాలీవుడ్ దృష్టిని కూడా ఆకర్షించారు. థియేటర్ ఆర్ట్స్ వంటి అనేక అమెరికన్ పత్రికలలో ఆమె కనిపించారు. ఇదే సమయంలో అమెరికన్ చిత్ర నిర్మాత ఫ్రాంక్ కాప్రా, ముంబై ని సందర్శించారు. ఎందరో నటీనటులు ఆయనను కలిశారు..కానీ ఒకే ఒక్క నటి మధుబాల రాలేదు. కాప్రా ఆమెకు హాలీవుడ్లో నటించేందుకు అఫర్ ఇచ్చారు. కానీ ఆమె తండ్రి అందుకు ఒప్పుకోలేదు.
మధుబాల మహల్ తర్వాత అనేక విజయవంతమైన చిత్రాలను పొందారు. తనకు, తన కుటుంబానికి ఆర్థిక రక్షణను కల్పించాలనే వత్తిడితో, ఆమె తన కౌమార దశలోని మొదటి నాలుగు సంవత్సరాలలో ఇరవై-నాలుగు చిత్రాలలో నటించారు. ఫలితంగా, ఆ సమయంలో విమర్శకులు ఆమె నటనా సామర్ధ్యం కంటే అందమే గొప్పగా ఉందని విమర్శించారు. చిత్ర పాత్రల ఎంపికలో అజాగ్రత్త కూడా దీనికి కారణం. తన కుటుంబానికి ఏకైక ఆధారంగా, ఆమె ఏ చిత్రంలో నైనా నటించడానికి అంగీకరించి, ఒక అద్భుత నటిగా తన గుర్తింపు హానికి కారణ మయ్యారు. అనంతరం ఆమె దీనికి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. బిమల్ రాయ్ బిరాజ్ బహు దీనికి ఒక ఉదాహరణ. ఈ నవల చదివిన మధుబాల, చిత్ర అనుసరణలో ప్రధాన పాత్రను పోషించాలని ఆశించారు.ఆమె తన మార్కెట్ ధరను అడుగుతుందనే ఉద్దేశంతో బిమల్ రాయ్ అప్పుడే ఎదుగుతున్న కామినీ కౌశల్ కు ఆ పాత్ర ఇచ్చారు. తన పాత్రను కోల్పోవడానికి కారణం తెలిసినపుడు, మధుబాల, తాను ఈ చిత్రంలో ఒక రూపాయి ప్రతిఫలంతో అయినా నటించే దానినని బాధ పడ్డారు. ఒక మంచి నటిగా తన ప్రతిష్ఠను పెంచు కోవాలనే కోరిక ఆమెకు అంతగా ఉండేది. ఒక నటిగా, మధుబాల పరిశ్రమలో ఉన్నత స్థానాన్ని అధిరోహించారు. అశోక్ కుమార్, రాజ్ కపూర్, రెహ్మాన్, ప్రదీప్ కుమార్, షమ్మీ కపూర్, దిలీప్ కుమార్, సునీల్ దత్ , దేవ్ ఆనంద్. మధుబాల ఆ కాలంలోని అనేక ప్రసిద్ధ ప్రధాన నటీమణుల సరసన కూడా నటించారు, వీరిలో కామినీ కౌశల్, సురయ్య, గీతా బాలి, నళిని , నిమ్మి వున్నారు. మెహబూబ్ ఖాన్, గురు దత్, కమల్ అమ్రోహి, ఆసిఫ్ డైరెక్టర్లు ఉన్నారు. ఆమె నిర్మాణ రంగంలో ప్రవేశించి నాతా అనే చిత్రాన్ని నిర్మించి నటించారు.
మధుబాల తనను తాను వైవిధ్యమైన నటిగా నిరూపించు కున్నారు. బాదల్ మూవీలో మూస ధోరణిలో ఉత్తమ స్త్రీ పాత్ర ధరించారు. తరానాలో ఎదురు లేని అందమైన పల్లెటూరి పడుచుగా నటించారు. సాంప్రదాయ ఆదర్శ భారత స్త్రీగా ఆమె సంగ్ దిల్ లో ఒదిగి పోయారు. మార్గం తప్పిన వారసురాలు అనితగా గురుదత్ వ్యంగ్య చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మూవీలో హాస్య పాత్రలో నటించారు. సమకాలీన పాత్రల చిత్రణలో సమానమైన విజయంతో, సాంఘిక చిత్రం కల్ హమారా హై లో ద్వంద్వ పాత్రలతో గుర్తుండి పోతారు. 1958లో వరుస విజయాలతో ఆమె తన వృత్తి జీవితాన్ని మలుపు తిప్పారు. హౌరా బ్రిడ్జ్ చిత్రంలో అశోక్ కుమార్ కు ప్రతిగా మధుబాల అసాధారణమైన ఆంగ్లో ఇండియన్ కేబరే గాయనిగా నటించారు. ఫాగున్ లో భరత్ భూషణ్‌కు ప్రతిగా, కాలాపానీలో దేవ్ ఆనంద్‌కు, శాశ్వత విజయాన్ని పొందిన చల్తీ కా నామ్ గాడీలో కిషోర్ కుమార్‌తోనూ బర్సాత్ కి రాత్ లో భరత్ భూషణ్‌కు ప్రతిగా నటించారు.
కిషోర్ కుమార్ హిందూ, మధుబాల ముస్లిం కావడంతో 1960లో వారు పౌర వివాహం చేసుకున్నారు. దానికి హాజరు కావడానికి ఆయన తల్లిదండ్రులు నిరాకరించారు. కుమార్ తల్లిదండ్రులను సంతృప్తి పరచడానికి ఈ జంట హిందూ వేడుకను కూడా జరుపుకున్నారు, కానీ మధుబాల ఎప్పుడూ అతని నిజమైన భార్య కాలేక పోయారు. కుమార్ గృహంలో కలతల కారణంగా వివాహమైన నెల రోజుల్లోనే ఆమె తన బాంద్రా భవంతికి తిరిగి వచ్చారు. మధుబాల శేష జీవితమంతా విపరీతమైన ఒత్తిడితోనే కొనసాగింది. ఇక మధుబాల అంటేనే ముఘల్-ఏ-ఆజం. ఇప్పటికీ ఎప్పటికీ మరిచి పోలేని సినిమా అది. ఈ ఒక్క సినిమాతో ఆమె కీర్తి నలుదిశలా పాకింది. కొద్దీ కాలం మాత్రమే బతికిన మధుబాల ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి