శేషేంద్రుడు ప్రాతః స్మరణీయుడు

 

రూపం అపురూపం. అక్షరం అద్భుతం. తెలుగు సాహిత్యంలో గుంటూరు శేషేంద్ర శర్మ ఓ సంచలనం. ఎన్నదగిన సాహితీవేత్తలలో ప్రముఖుడిగా ఉన్నారు. ఆయన రాసిన ప్రతి అక్షరం, పదం జనాన్ని, లోకాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. అలంకార శాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వ మానవ దృష్టి. అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. సర్వేజనా సుఖినో భవంతు అన్నది ఆయన ఆత్మ నినాదం. నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు గ్రామంలో పుట్టారు. భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వ విద్యాలయం గౌరవ డాక్టరేటు తో పాటు ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు.

గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో మున్సిపల్‌ కమీషనరుగా పని చేసి, పదవీ విరమణ పొందారు. నా దేశం – నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణ హంస, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్‌ లాంటి ప్రజా రంజకమైన రచనలు చేశారు. కవిత్వంలో, సాహిత్య విమర్శలో పేరు పొందారు. ప్రపంచ సాహిత్యం, భారతీయ సాహిత్యం మీద ఆయనకు సాధికారిక పరిచయం ఉన్నది. అంతే కాక సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో అపారమైన అనుభవం ఉన్నది. వచన కవిత్వంతో పాటు పద్యాలను రాయడంలో ఆయనకు ఆయనే సాటి. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లు ప్రతిసారి ఆయనను ప్రస్తావిస్తూనే ఉంటారు.

గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు. ఈ రచనలు అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించాయి. నా దేశం-నా ప్రజలు 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది. సోహ్రాబ్ – రుస్తుమ్, శేషజ్యోత్స్న, మండే సూర్యుడు, రక్తరేఖ, నా దేశం – నా ప్రజలు, నీరై పారిపోయింది, గొరిల్లా,నరుడు – నక్షత్రాలు, షోడశి – రామాయణ రహస్యములు, స్వర్ణ హంస, ఆధునిక మహాభారతం, జనవంశం, కాలరేఖ, కవిసేన మేనిఫెస్టో,మబ్బుల్లో దర్బార్, హిత్య కౌముది, ఋతు ఘోష, ప్రేమ లేఖలు ఎంతో పేరు తీసుకు వచ్చాయి. శేషేంద్ర శర్మ 1975లో విడుదలైన ముత్యాల ముగ్గులో నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది అనే ప్రసిద్ధమైన పాట రాశాడు. ఆ సినిమాలో అధిక భాగం శేషేంద్ర నివాసమైన జ్ఞాన బాగ్ పాలెస్ లో తీశారు. ఈ ఒక్క పాట యిప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ గా ఉన్నది. 2007 మే 30 రాత్రి గుండెపోటుతో కన్ను మూయడంతో తెలుగు లోకం గొప్ప సాహిత్యకారుడిని కోల్పోయింది.

కామెంట్‌లు