కడలి కల్లోలం..కన్నీటి జలపాతం
చూస్తే సముద్రం. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఎగసి పడే అలలు. కెరటాల కల్లోలాలు కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విలవిలలాడి పోతోంది. ప్రతిసారి ప్రకృతి ప్రతాపం చూపిస్తోంది. వేగంగా తాకే గాలులు..ఎప్పుడు వచ్చి పడతాయో తెలియని దారుణ పరిస్థితి. తుపాను వస్తుందని తెలుసు..కానీ బంధాలను తెంచేలా మారుతుందని ఎవరికి ఎరుక. ఎక్కడైనా పేదలే ..ఏమీ లేనివాళ్లే ఎక్కువగా నష్టపోయేది. సముద్రాలకు ఏం తెలుసు..మట్టిని నమ్ముకుని బతుకుతున్నారని..నీళ్లు లేకపోతే ఉండలేరని.
ఉవ్వెత్తున ఎగసి పడడం..తీరాలను దాటడం..కల్లోలాన్ని సృష్టించడం. భారీ నష్టం జరిగాక..మళ్లీ ప్రశాంతంగా ఉండటం ..దానికి తెలిసినంత మనకు తెలీదు. ఎందుకంటే ఏం చెప్పగలం..ఏమీ చేయలేం. కాసిన్ని కన్నీళ్లను దోసిళ్లలోకి తీసుకోవడం తప్పా. గుండెలో బాధ ఉబికి వస్తుంటే..కళ్లు గూళ్ల వైపే చూస్తుంటాయి. ఎప్పుడు గాలొచ్చి ఎగరేసుకు పోతుందో తెలీదు కనుక.
గూడు చెదిరినా..గుండె కెలుక్కుమన్నా ఎందుకనో అందులోనే చనిపోయేందుకే ఇష్టపడతారు ఏమీ తెలియని అమాయక జనం. ఎవరినన్నా పలకరిస్తే ..ఎక్కడికి వెళ్లగలం..బతుకైనా..చావైనా ఇందులోనే . అలలు వస్తాయి. కెరటాలు మమ్మల్ని తాకుతాయి. అదృష్టం వుంటే బతుకుతాం. లేకపోతే విడిచి వెళ్లిపోతాం. బాగున్నప్పుడు సముద్రం మమ్మల్ని అక్కున చేర్చుకుంటుంది. అదే ఆధారం. అందులోనే ఆడుకుంటాం..పాడుకుంటాం..విడిచి వెళ్లాలంటే ఏదో తెలియని బాధ వెంటాడుతుంది అంటారు.
మీకు తుపాను మాత్రమే కనిపిస్తుంది..మాకు మాత్రం అందులో బరువైన బతుకు దాగుందంటారు. ఈ ప్రజలంతా ఆ సముద్రాల చుట్టూ తచ్చట్లాడుతూ కనిపిస్తుంటారు. ఏదైనా దొరుకుతుందనా కాదు..మన ఆలోచనల్లాగే అలలు..మన కోరికల్లాగే కెరటాలు..అన్నీ ఒక్కటే తేడా ఇక్కడ కాలం ..జీవితం..అక్కడ సముద్రం ఒక్కటే.
కల్లా కపటం ఎరుగని పిల్లలు..కులమతాలంటూ తెలీని మనుషులు ఈ సంద్రంలో కలిసి పోతారు. అల్లుకు పోతారు. అందుకే తుపాను వస్తుందంటే కొందరికి భయం. మాకు మాత్రం ఇది మామూలే. దానితోనే కదా జీవితమంతా సహవాసం. బతుకు భారమే..చెట్టుకొకరం పుట్టకొకరం అయిపోతాం..కానీ మళ్లీ కలుసుకుంటాం. చెట్లు ..విద్యుత్ స్తంభాలు కూలిపోతాయి. కానీ కష్టం చేసి పండించిన పంటలు..చేతికొచ్చిన చెట్లు కూలిపోతుంటే..బిడ్డలను పోగొట్టుకున్నంత బాధ. ఒక్కోసారి ఎందుకొచ్చిన బాధ ..ఎక్కడికైనా పోవాలని అనిపిస్తుంది..కానీ కష్టం వచ్చినా ..కన్నీళ్లు వచ్చినా ఇక్కడే ఉండిపోతాం. మాకూ..దీనికి ఏనాడో రాసి పెట్టి ఉంది..అందుకనే పచ్చదనం పరుచుకున్న ఈ ప్రాంతమంటే ప్రాణం.
కళ్లముందే ఎప్పుడు తెల్లారుతుందో తెలీదు. రోడ్లే మాకు ఆలంబన. శిబిరాలే మాకు ఆసరా. ఆకలి తీర్చేందుకు నిరీక్షణ..మా కడుపులు కాలితే పర్వాలేదు..మా బిడ్డలు రాలిపోతే చెప్పలేనంత బాధ..ఈ శోకం తీరదు..ఈ బతుకు మారదు..అయినా కడలితోనే బంధం..అలలతోనే ఆవాసం..కెరటాలతోనే సంచారం..అంటున్నారు బాధితులు. ప్రకృతి ప్రకోపం ముందు..టెక్నాలజీ ఏం చేస్తుందన్నదే మిలియన్ డాలర్ ప్రశ్న.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి