అస్తమించని కళారవి కాళన్న
నిత్యం పోరాటమే ఊపిరిగా చేసుకుని రచనలు చేశారు. నైజాంకు వ్యతిరేకంగా, పౌర హక్కుల కోసం నిలబడిన నిజమైన కవి. కాళోజి జీవితమే కవిత్వం. ప్రతి సంఘటన ఆయన రచనల్లో కనిపిస్తుంది. ఆయన నిజమైన తెలంగాణ గాంధీ. సింప్లిసిటీకి ప్రతీకగా నిలిచారు. తెలంగాణ బతుకు ప్రయాణంలో మరిచి పోలేని మహోన్నతమైన కవి కాళోజి. అనువాదాలతో ఆకట్టుకున్నారు. 78 ఏళ్ళు బతికినా రాసుకుంటూనే పోయారు. సామాన్యుల నుంచి పండితుల దాకా అర్థమయ్యేలా కాళోజి రాసినట్లుగా ఇంకే కవి , రచయిత రాలేదు. అందుకే కాళోజి ప్రజా కవి. ఆయన జీవితమంతా ఉద్యమాలతోనే సాగింది. ప్రజల మధ్యనే ఉన్నారు. వారి కోసమే బతికారు. ఊపిరి ఉన్నంత దాకా రాస్తూనే ఉంటా ప్రశ్నిస్తూనే వుంటా అన్నారు కాళోజి. ఆయన ప్రజా గొంతుకు ప్రతిరూపంగా నిలిచారు. ప్రతి ఊరులో గ్రంథాలయం ఉండాలని కోరాడు. రాజకీయ, సాంఘిక చైతన్యాల సమాహారం.
కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా తన కలం ఎత్తాడు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం గా చేసి గౌరవించింది. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించిన ధీశాలి కాళన్న. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయన గేయాల్లో రూపు కడతాయి. రాయడమే కాదు ఆచరించి చూపించిన పోరాట వీరుడు. ‘హింస తప్పు, రాజ్య హింస మరీ తప్పు’ అంటూ “సామాన్యుడే నా దేవుడు” అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుది శ్వాస విడిచాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి