వ్యాపార దిగ్గజం..స్ఫూర్తి శిఖరం..జాక్ మా..!
అన్నిట్లో వేలు పెడుతూ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని నిరంతరం పరితపించే అమెరికా ముగ్గురి విషయం వచ్చే సరికల్లా తొట్రుపాటుకు గురవుతూ ఉంటుంది. ఇద్దరు ఈ లోకాన్ని వీడితే ఇంకొకరు ఇప్పుడు ఈ నేల మీద వున్నారు. పెద్దన్నకు నిద్ర లేకుండా చేస్తున్న వారెవ్వరో కాదు పోరాట యోధుడు చేగువేరా అయితే , ఉద్యమ వీరుడు ఫెడరల్ కాస్ట్రో ..మరొకరు చైనాకు చెందిన వ్యాపార దిగ్గజ శిఖరం ..జాక్ మా. ఇప్పటికీ యుఎస్ కు అర్థం కావడం లేదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా వినుతి కెక్కిన జాక్ మాకు 55 ఏళ్ళు. ఒక సామాన్యుడు అసాధారణమైన రీతిలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ, తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచమంతటా విస్తరించేలా చేసిన ఘనత ఆయనది. అతడు స్థాపించిన ఆలీబాబా ఇప్పుడు కోట్లు కోళ్ల గొడుతోంది. బిజినెస్ లో తనకు ఎదురే లేకుండా సాగుతోంది. జాక్ చైనాలోని హాంగ్జౌలో ఉంటున్నారు. ఆయన జీవితం కోట్లాది మందికి స్ఫూర్తి కలిగిస్తోంది. వేలాది మందికి దారి చూపుతోంది. జంగ్ యింగ్ ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఆలీబాబా వ్యాపార సంస్థలకు అధిపతిగా ఉన్నారు. అత్యున్నత కట్టుదిట్టమైన దేశంలో అంచెలంచెలుగా విజయవంతమైన పారిశ్రామిక వేత్తగా పేరు పొందారు జాక్ మా. ఆలీబాబా.కామ్ ఇ-కామర్స్ పోర్టల్ అధినేత. చైనాలో అత్యంత సంపన్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. జాక్ మా చిన్నప్పటి నుండే కష్టపడే స్వభావాన్ని అలవర్చుకున్నాడు. 12 ఏళ్ల వయసులో ఆంగ్ల భాషను నేర్చు కోవడం మొదలు పెట్టాడు. ఆంగ్లంలో కాస్త పట్టు సాధించాక సొంతూరుకి దగ్గర్లోని హాంగ్జౌ నగరంలోని ఒక హోటల్‌కు తొమ్మిదేళ్ల పాటు రోజూ సైకిల్ మీద వెళ్లే వాడు. పర్యటన కోసం, వాణిజ్యం కోసం చైనా దేశానికి వచ్చే విదేశీయులకు గైడ్‌గా ఉచిత సేవలు అందించే వాడు. ఆంగ్లంలో తన నైపుణ్యాల్ని మెరుగు పరుచు కోవడానికదో అద్భుత అవకాశంగా భావించి అలా చేసే వాడు జాక్. గైడ్‌గా పనిచేసిన తొమ్మిదేళ్లలో జాక్‌లో ఎంతో మార్పు వచ్చింది. అతడు చైనాలో ఉంటూనే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు. గురువుల దగ్గరా, పుస్తకాల్లోనూ నేర్చుకున్న వాటికి భిన్నమైన అంశాల్ని విదేశీయుల నుంచి అలవర్చుకున్నాడు.1979లో జాక్ జీవితాన్ని మార్చేసిన ఒక సంఘటన జరిగింది. ఆస్ట్రేలియాకు చెందిన ఒక కుటుంబం చైనా పర్యటనకు వచ్చినపుడు వారితో జాక్‌కు పరిచయం ఏర్పడింది. మూడు రోజుల పాటు జాక్ వారితో ఆడుతూ పాడుతూ గడిపాడు. ఆ తర్వాత వారు జాక్‌కు స్నేహితులు అయ్యారు. 1985లో ఆ కుటుంబం ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా వెళ్లి నెల రోజుల పాటు అక్కడ కొత్త ప్రపంచాన్ని చూశాడు. ఆంగ్ల ఉపాధ్యాయుడు అవ్వాలనే లక్ష్యంతో ‘హాంగ్జౌ టీచర్స్ యూనివర్సిటీ’ ప్రవేశ పరీక్ష రాశాడు. ఆ పరీక్షలో మూడోసారి సఫలీకృతుడయ్యాడు. అక్కడ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠాలు చెప్పే ఆంగ్ల ఉపాధ్యాయుడు అర్హతకు అవసరమయ్యే విద్యను అభ్యసించాడు. అదే సమయంలో విశ్వవిద్యాలయ విద్యార్థి నాయకుడిగా, నగరంలోని విదార్థి సంఘం నాయకుడి గానూ ఎన్నికయ్యాడు. విద్య పూర్తి చేశాక అదే విశ్వవిద్యాలయంలో సుమారు 1000 రూపాయల నెల జీతానికి పాఠాలు చెప్పే వాడు. అక్కడ జీతం సరిపోక పెద్ద హోటల్‌లో లేదంటే బహుళజాతి సంస్థలో ఉద్యోగిగా చేరాలనే లక్ష్యంతో ఉండే వాడు జాక్. అప్పుడే ప్రపంచాన్ని దగ్గరగా పరిశీలించ వచ్చనేది అతడి ఆలోచన. 1992 నాటికి చైనాలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు వచ్చాయి. ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నాడు జాక్. అందులో కేఎఫ్‌సీ జీఎంకి సెక్రటరీ పోస్టు ఒకటి. కానీ అతన్ని ఎవరూ తీసుకోలేదు. దాంతో సొంతంగా అనువాద సంస్థను ప్రారంభించాడు. జాక్ 1995లో చైనా వ్యాపార బృందంతో కలిసి దుబాసీగా అమెరికాలో పర్యటించాడు. అక్కడే జాక్ స్నేహితుడు మొదటిసారి ఇంటర్నెట్‌లో సమాచారం ఎలా వెతకాలో చూపాడు.అదో మాయలా అనిపించింది అతడికి. ఇద్దరూ యాహూలో సర్చ్ చేస్తుంటే చైనాకు సంబంధించిన సమాచారం మాత్రం దొరకలేదు. దాన్నో అవకాశంగా తీసుకొని రూ.1.2 లక్షల పెట్టుబడితో ‘చైనా పేజెస్’ పేరుతో వెబ్ సైట్‌ని ప్రారంభించాడు. అప్పటి వరకూ జాక్ కీబోర్డుని కూడా తాకింది లేదు. ఇక పీసీలూ, ఈమెయిల్స్ వినియోగంలో అతడి ప్రతిభ గురించి వేరే చెప్పనవసరం లేదు. అందుకే తాను ప్రయాణం మొదలు పెట్టిన తీరుని ‘ఒక గుడ్డివాడు గుడ్డి పులి మీద స్వారీ చేయడం లాంటిద’ని చెబుతాడు. అప్పట్నుంచీ జాక్ జీవితం ఇంటర్నెట్‌తో ముడి పడింది. తన వెబ్ సైట్‌తో ‘చైనా టెలికామ్’ సంస్థ సైట్‌కి జాక్ గట్టి పోటీ ఇచ్చాడు. ఆ సమయంలో సుమారు కోటి రూపాయల పెట్టుబడితో సంస్థ పెడతాననీ కలిసి పని చేద్దామనీ చైనా టెలికామ్ జీఎమ్ జాక్‌కు చెప్పాడు. దాన్నో అవకాశంగా భావించి సరేనన్నాడు జాక్. ‘కొత్త సంస్థ బోర్డులో ఆ జీఎమ్ మనుషులు అయిదుగురు, మేం ఇద్దరం ఉండేవాళ్లం. మేం ఏం చెప్పినా దానికి అడ్డుపుల్ల వేసేవారు. మా భాగస్వామ్యం ఏనుగుకీ, చీమకీ మధ్య భాగస్వామ్యంలా ఉండేది. లాభం లేదని సంస్థ నుంచి బయటకు వచ్చేశా’ అంటాడు జాక్.అప్పుడే బీజింగ్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఒక ఈ-కామర్స్ వెబ్ సైట్‌ను ప్రారంభించే అవకాశం వచ్చింది జాక్‌కి. కానీ సొంత సంస్థ ప్రారంభించాలనేది అతడి కల.1999లో ఒక రోజు 18 మంది పరిచయస్తుల్ని పిలిచి రెండు గంటల పాటు తన ఆన్‌లైన్ వ్యాపార ఆలోచనల్ని వివరించాడు జాక్. వారికి ఆలోచనలు నచ్చి తమ దగ్గరున్న డబ్బుని ఇచ్చారు. అలా 36 లక్షలు పోగయ్యాయి. జాక్ ఇదే ఆలోచనని అమెరికా పెట్టుబడి దారులతోనూ చెబితే ఎవరూ ముందుకు రాలేదు. తన సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ పరిచయం ఉన్న పేరు ఎంచుకుందామని ఆలోచించి ‘అలీబాబా’ను ఖరారు చేశాడు జాక్. ‘అలీబాబా కథల్లో దాగిన నిధుల్ని వెలికి తీస్తాడు.మేం ఈ-కామర్స్ సామ్రాజ్యంలో ఆ పని చేస్తామన్న అర్థమూ ఉంది’ అంటాడు జాక్. చాలా ఐటీ కంపెనీల మాదిరిగానే అలీబాబా కూడా దాని వ్యవస్థాపకుడి ఇంట్లోనే మొగ్గ తొడిగింది. మిగతా ఈ-కామర్స్ వెబ్‌సైట్ల మాదిరిగా వ్యాపారికీ, వినియోగదారుడికీ మధ్య వారధిగా కాకుండా వ్యాపారికీ-వ్యాపారికీ మధ్య వారధిగా ఏర్పడింది అలీబాబా.డాట్‌కామ్. చైనా వస్తువులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను గుర్తించి జాక్ ఈ మార్గాన్ని ఎన్నుకున్నాడు. దుస్తులూ గృహోపకరణాల అమ్మకాలూ కొనుగోళ్లు చేసే సంస్థలకు ఇదో ప్రపంచ స్థాయి సంత. ఆ విధానంతో మూడేళ్ల పాటు వేగంగా అభివృద్ధి చెందింది అలీబాబా. అలీబాబా గ్రూప్‌లో చాలా కంపెనీలు ఉన్నాయి. అలీబాబా.డాట్.కామ్‌తో పాటు యాహూతో కలిసి చైనాలో ‘యాహూ చైనా’ వెబ్ సైట్‌ను నిర్వహిస్తోంది. అలాగే ఈబే తరహా ఆన్‌లైన్‌లో వస్తువుల వేలం నిర్వహించే ‘టావోబవో’నూ, టీమాల్ పేరుతో రిటైల్ వెబ్ సైట్‌నూ నడుపుతోంది. ఈ సంస్థకు టీమాల్, టావో బవో సైట్ల ద్వారా ప్రధానంగా ఆదాయం వస్తోంది. చాటింగ్ కోసం ‘లైవాంగ్’ ఆప్‌నీ, అలీ మామా పేరుతో ఒక ఆన్‌లైన్ ప్రకటనల వెబ్ సైట్‌నూ ప్రారంభించింది. వివిధ దేశాల్లో అలీబాబా స్థానిక ఈ-కామర్స్ వెబ్ సైట్లనూ మొదలు పెట్టింది. ‘మా దగ్గర డబ్బులేదు, టెక్నాలజీ లేదు, ప్రణాళిక లేదు. అందుకే ప్రతి అడుగూ జాగ్రత్తగా వేశాం. ప్రతి రూపాయీ ఆలోచించి ఖర్చు పెట్టాం’ అంటాడు జాక్ మా . ఎదిగే క్రమంలో తానూ తప్పులు చేశానంటాడు జాక్. ‘నాతోపాటు పెట్టుబడి పెట్టిన 18 మందీ కంపెనీలో మేనేజర్లుగా ఉండొచ్చని చెప్పాను. పెద్ద స్థానాల్లో బయటి వారిని పెడదామని చెప్పి అలాగే చేశాను. ఏడాది లోపే ఆ బయటివారు వెళ్లిపోయారు. దాంతో నా మిత్రులే తర్వాత ఆ ఖాళీల్ని భర్తీ చేసి రాణించారు’ అంటాడు మా. రానున్న ఐదు సంవత్సరాలలో అలీబాబాతో లక్షల ఉద్యోగాల్ని సృష్టించి తద్వారా చైనా సామాజిక, ఆర్థిక వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పు తీసురావాలి అన్నది జాక్ మా కల. లక్ష్యం కూడా. ఏ నేల తనకు ప్రాణం పోసిందో దాని ఋణం తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆయన. జాక్ మా ..నువ్వు ప్రపంచ మానవులకు ఓ నిత్యా పాఠం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి