అభివృద్ధికి ఆమడ దూరం..ఉస్మానియాపై ఎందుకంత కోపం..?

 

ఈ దేశంలో సామాజిక చైతన్యం కలిగిన యూనివర్సిటీస్ లలో మొదటి పేరు ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ యూనివర్సిటీ ఇప్పుడు దిక్కులేనిదైంది. తాజాగా వందేళ్ల ఉత్సవం జరుపుకున్నా కనీస వసతులకు నోచుకోని దుస్థితికి దిగజారి పోయింది. నిత్య చైతన్యానికి, జీవన పోరాటానికి ప్రతీకగా ఉన్న ఈ చదువుల తల్లి ఇప్పుడు ఆసరా కోసం వేచి చూస్తున్నది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి పోసింది. వేలాది మంది చైతన్యం కలిగిన విద్యార్థులు, తెలంగాణ ప్రాంతపు బిడ్డలు రోడ్లపైకి వచ్చారు. ఆందోళనలు చేపట్టారు. ఖాకీల దాస్టికానికి బలై పోయారు. ఇంకొందరు నామ రూపాలు లేకుండా పోయారు.

ఈ దేశపు అభివృద్ధిలో, పునర్ నిర్మాణంలో ఎందరో మేధావులు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాలలో నిష్ణాతులైన వారంతా ఈ ఉన్నత విద్యాలయం నుంచి వచ్చిన వారే. ప్రపంచాన్ని విస్మయ పరిచేలా చేసిన ఘనత ఇక్కడ,.ఈ నాలుగు గోడల మధ్యన చదువుకున్న వారిదే. జాతికి జీవగర్రలాగా మారిన చరిత్రను స్వంతం చేసుకున్నది ఇక్కడే. పోరాటాలకు, ఆరాటాలకు నెలవై పాటలకు, కవితలకు ప్రాణం పోసుకున్నది ఈ జాగాలోనే. ఎంత చెప్పినా తక్కువే . ఒక ఏడాది కాదు ఒక దశాబ్డం పడుతుంది ఈ యూనివర్సిటీ గురించి చెప్పాలంటే . ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి ..అక్కడ ఎవరో ఒకరు ఈ యూనివర్సిటీలో చదువుకున్న వారై ఉంటారు. అంటే దీని విశిష్టత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు
ఈ దేశానికి ప్రధానమంత్రిని , బెస్ట్ పార్లమెంటేరియన్ ను అందించింది ఇదే. ప్రపంచాన్ని తన గొంతుతో మెస్మరైజ్ చేస్తున్న బెస్ట్ కామెంటేటర్ హర్ష భోగ్లే , ఎంపీ అసదుద్దీన్ ఓ వైసీ ..ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో లెక్కలేనంత మంది ఉన్నారు. ఆయిల్ కంపెనీలకు పెద్ద దిక్కుగా ఉన్న వారు కూడా ఇక్కడ ఇంజనీరింగ్ చదువుకున్న వారే. ప్రతి రంగంలో తమ దైన ముద్రను వేసిన వాళ్లంతా ఇక్కడి స్టూడెంట్సే. ఇంతటి చరిత్ర కలిగిన యూనివర్సిటీ ఇప్పుడు నగరంలోనే ఉన్నా ఆదరణకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు. యూనివర్సిటీని ఆధునీకరించాల్సిన అవసరం ఉన్నది. పేరుకే గోడలు..పెచ్చులూరే పరిస్థితికి చేరుకున్నాయి. ఇంకా పాత కాలం నాటి ఆనవాళ్లు ఉన్నాయి. ఆధునిక పోకడ లేకున్నా కనీసం ప్రస్తుతం ప్రపంచంతో పోటీ పడేలా యూనివర్సిటీని తీర్చి దిద్దాల్సిన బాధ్యత వీసీపై , ప్రభుత్వంపై ఉన్నది.
ఇక పోతే 1918 లో దీనిని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ 7వ నిజాం ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆసఫ్ జా దీనికి బీజం వేశారు. దీని స్థాపనకు సంబంధించిన ఫర్మానాను 1917, ఏప్రిల్‌ 26న జారీ చేశారు. ఆబిడ్స్ ప్రాంతంలో ఒక అద్దె భవనంలో తరగతులు ప్రారంభించగా, 1939లో ప్రస్తుత ఆర్ట్స్ కళాశాల భవనం నిర్మించారు. 1919లో కేవలం ఇంటర్మీడియట్ తరగతులతో ప్రారంభమవగా, 1921 నాటికి డిగ్రీ, 1923 నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో ఉర్దూ బోధనా భాషగా ఉండగా,1948 నుంచి ఆంగ్లం బోధనా భాషగా మారింది. ఉన్నత విద్యను అన్ని సామాజిక వర్గాలకు అందించాలనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం 1913 లో తమ పాలనలో వున్న ప్రాంతాలలోనే గాక సంస్థానాలలో కూడా విశ్వవిద్యాలయాలను స్థాపించాలని తీర్మానించింది.
ఆవిధంగా పాట్నా, బనారస్, మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయాలు స్థాపించ బడ్డాయి. ఆబిడ్స్‌ గన్‌ఫౌండ్రి దగ్గర తరగతులు ప్రారంభమయ్యాయి. భారతదేశంలో ఉన్నత విద్యా ప్రాప్తిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం 7వ ప్రాచీన సంస్థగా, దక్షిణ భారతావనిలో 3వ సంస్థగా పేరొందింది. . ఇది హైదారాబాదు సంస్థానంలో స్థాపించ బడిన మొట్ట మొదటి విద్యా సంస్థ. తన తొమ్మిది దశాబ్దాల చరిత్రలో ఈ విశ్వ విద్యాలయము అన్ని విభాగాలలోనూ మంచి పురోగతి సాధించింది.ఇక్కడ ఉర్దూ ప్రథమ భాషగా, మాద్యమంగా ప్రవేశ పెట్టి బ్యూరో ఆఫ్ ట్రాన్స్లేషన్ ను ఏర్పాటు చేసారు. మొదట గన్ ఫౌండ్రీ ప్రాంతంలో 25 మంది సిబ్బంది, 225 విద్యార్థులతో ఇంటర్మీడియట్ సాయంకాలం కోర్సులతో ప్రారంభించి క్రమంగా 1921 లో బి.ఏ, 1923 లో ఎం.ఎ, ఎల్.ఎల్.బి 1927 లో మెడిసిన్, 1929 లో ఇంజనీరింగు కోర్సులను ప్రవేశ పెట్టారు.
నగరంలో వివిధ ప్రాంతాలలో వున్న కళాశాలలను పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే ప్రాంతంలో వుంటే బాగుంటుందని భావించి, తార్నాక ప్రాంతంలో 2400 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుత కాంపస్ ను ఏర్పాటు చేసారు. భవనాల నిర్మాణానికి ఆర్కిటెక్ లుగా సయ్యద్ అలీ, రజా, నవాబ్ జయంత్ సింగ్ బహదూర్ లను నియమించారు. అమెరికాలోని కాలిఫోర్నియా స్టాన్‍ఫోర్డ్, హార్వర్డ్, కొలంబియా, బ్రిటన్ లోని ఆక్స్ పర్డ్, కేంబ్రిడ్జ్ మొదలైన విశ్వవిద్యాలయాలను సందర్శించి వచ్చారు. బెల్జియానికి చెందిన ఇ జస్సార్ ను సలహాదారుగా నియమించి లా, ఇంజరీరింగ్, ఆర్ట్స్ కళాశాల లైబ్రరీ , సెనేట్ హాలు , తదితర భవనాలు నిర్మించారు. ఆర్ట్స్ కాలేజి భవనానికి 1923 జూలై 5న పునాదులు వేసి, 1939 డిసెంబరు నాల్గవ తేదీన పూర్తి చేసారు. అదే రోజున హైదరాబాదు నిజాం దీనిని ప్రారంబించాడు. నైజాంలో విద్యాశాఖ మంత్రిగా ఉండిన అక్బర్ హైదర్ వీసీగా, నవాబ్ మెహదీయార్ జంగ్ బహదూర్ వైస్ ఛాన్సెలర్ గా నియమితులయ్యారు. 1949 లో హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి వరకు ఉన్న ఉర్దూ మాధ్యమాన్ని రద్దు చేసి ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశ పెట్టారు.
ఇస్లాం యూనివర్సిటీగా నామకరణం చేయాలని మొదట్లో వచ్చిన ప్రతి పాదనను కాదని ఉస్మానియా యూనివర్సిటీగా పేరు పెట్టారు. ఇండియా టుడే పత్రిక మన దేశంలో వున్న 160 యూనివర్సిటీలపై సర్వే నిర్వహించగా 2010 వ సంవత్సరంలో 10వ స్థానం, 2011లో 7వ స్థానం, 2012 లో ఆరవ స్థానం లభించింది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూన్ 17న 80వ స్నాతకోత్సవం జరిగింది. స్నాతకోత్సవానికి గవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై 292 మందికి బంగారు పతకాలు, 700 మందికిపైగా అభ్యర్థులకు పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేశారు.1917 నుండి ఇప్పటి వరకు 47మందికి గౌరవ డాక్టరేట్లు అందజేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రకు ప్రారంభమే తప్పా అంతమే లేదు. ఇకనైనా ప్రభుత్వం దీని అభివృద్ధి కోసం ద్రుష్టి సారించాలని మేధావులు కోరుతున్నారు. కాగా, ఈ దేశంలో అన్ని యూనివర్సిటీలు పట్టాలు ప్రధానం చేస్తాయి, కానీ ఓయూ మాత్రం విద్యార్థులను మనుషులుగా చేస్తాయి..అందుకే మిగతా వాటికి దీనికి తేడా.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!