ఎవరికి వారే ఎమునా తీరే
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వెలువడినా ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉన్నది. బీజేపీ, శివసేన పార్టీల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. ట్రబుల్ షూటర్ చంద్ర షా రంగంలోకి దిగినా ఈ రోజు వరకు ఇరు పార్టీల అధినేతల మధ్య స్నేహం చిగురించ లేదు. ఎవరికి వారే పట్టు వీడడం లేదు. దీంతో మరాఠాలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇంకో అయిదు రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోతే
రాష్ట్రపతి పాలన విధించే ఛాన్స్ ఉందంటూ బీజేపీ నేత, ఆర్థిక మంత్రి ముంగంతి వార్ జోశ్యం చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి 8వ తేదీతో ముగుస్తుంది. దీపావళి పండుగ కారణంగా శివసేన, బీజేపీల మధ్య చర్చలు ప్రారంభం కాలేదని, ఒకట్రెండు రోజుల్లో అవి ప్రారంభమవుతాయని తెలిపారు.
ఏ ఒక్క పార్టీకో అనుకూలంగా ప్రజలు తీర్పు ఇవ్వలేదని. బీజేపీ, సేన కూటమికి వారు మద్దతిచ్చారని వ్యాఖ్యానించారు. మా కూటమి ఫెవికాల్ కన్నా, అంబుజా సిమెంట్ కన్నా దృఢమైనది అని వ్యాఖ్యానించారు. మరో వైపు, శివసేన వ్యక్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడంటూ సేన నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. సేన కోరుకుంటే.. సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సభ్యుల మద్దతు కూడగట్టు కోగలదు అన్నారు. అధికారాన్ని సమంగా పంచు కోవాలనే ప్రతిపాదనకే మహారాష్ట్ర ప్రజలు ఓటేశారన్నారు. అతి వృష్టితో తీవ్రంగా నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందాల్సి ఉందని శివసేన పత్రిక సామ్నా పేర్కొంది. ఒకవేళ బీజేపీ, శివసేన ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైతే.. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తామని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, అదే పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాత్రం, ప్రతిపక్షంలో కూర్చోమనే ప్రజలు తీర్పిచ్చారని, తాము అదే పాటిస్తామని చెప్పారు. బీజేపీ, శివసేన డ్రామాలో పావు కావద్దొని కాంగ్రెస్‌కు ఆ పార్టీ నేత సంజయ నిరుపమ్ సూచించారు. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతివ్వాలన్న కాంగ్రెస్ ఆలోచనను ఆయన తప్పు బట్టారు. ఇదిలా ఉండగా బీజేపీ, శివసేనల మధ్య ఒప్పందం కుదిరే వరకూ తనను ముఖ్యమంత్రిగా చేయాలని బీడ్ జిల్లాకు చెందిన రైతు శ్రీకాంత్ విష్ణూ గడాలే కోరారు. కలెక్టర్‌ను కలిసి సీఎం పీఠంపై అస్పష్టత తొలిగే వరకు ముఖ్యమంత్రిగా వ్యవహరించి, రైతుల సమస్యలు పరిష్కరిస్తానంటూ వినతి పత్రం ఇవ్వడం విశేషం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి