కార్మికుల కోసం కదిలిన జన సేనాని

తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. అయినా ప్రభుత్వం నుండి ఇప్పటి దాకా స్పందన రాలేదు. కార్మికులు బెట్టు దిగడం లేదు. ప్రభుత్వం పట్టు వీడడం లేదు. హైకోర్టు చీవాట్లు పెట్టినా ముఖ్యమంత్రి కేసీఆర్ పెడచెవిన పెట్టారు. వీరి న్యాయపరమైన సమస్యల సాధన కోసం చేస్తున్న పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు మద్దతు పలికాయి. కార్మికుల సమ్మె సకల జనుల ఆందోళనగా మారింది. సంస్థలో పని చేస్తున్న 49 వేల మంది సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ సాక్షాత్తు సీఎం ప్రకటించారు. దీంతో తట్టు కోలేని కార్మికులు పలువురు ప్రాణాలు కోల్పోయారు.

అయినా ప్రభుత్వం కానీ, ఉన్నతాధి కారులు కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు పరామర్శించిన పాపాన పోలేదు. ఇంకో వైపు ప్రైవేట్ బస్సులు కొనుగోలుకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదిలా ఉండగానే ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు విపక్ష నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ను కలిశారు. సమ్మె చేసేందుకు దారితీసిన పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరిని, హైకోర్టు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సైతం పూసగుచ్చినట్టు తెలిపారు కోదండ రామ్, అశ్వత్థామ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, తదితరులు.

ప్రభుత్వం దిగి వచ్చే దాకా తమ సమ్మె ఆగదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. సకల భేరి సభను ఘనంగా చేపట్టారు. ఇదే సమయంలో తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి పవన్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు తన వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కార్మికులు చేస్తున్న పోరాటం అద్భుతం. మీ త్యాగం గొప్పది. మీ తరపున న్యాయం కోసం నేను కూడా వస్తా. మీ వెంట ఉంటా. వీలైతే సీఎం కేసీఆర్ ను కలుస్తా. ఆయనను ఒప్పిస్తా అని చెప్పారు. పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు జేఏసీ నేతలు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!