ఇండియా పటిష్టం..బంగ్లాకు ప్రమాదం
సౌత్ ఆఫ్రికాతో అన్ని ఫార్మాట్ లలో దుమ్ము రేపిన టీమిండియా జట్టు మరో రికార్డు ను క్రియేట్ చేసేందుకు ఉవ్విళ్లూరుతోంది. తాజాగా బాంగ్లాదేశ్ తో భారత జట్టు ఆడబోతోంది. ఇప్పటికే జట్లను ప్రకటించింది సెలెక్షన్ కమిటీ. బంగ్లా, ఇండియా ల మధ్య జరిగిన మ్యాచుల్లో మన జట్టుదే పైచేయిగా ఉంది. వన్డేల్లో అప్పుడొకటి... ఇప్పుడొకటి అన్నట్లు వేళ్ల మీద లెక్కపెట్టే విజయాలు సాధించిందేమో కానీ, టెస్టులు, టి20ల్లో అయితే టీమిండియాకు ఎదురేలేదు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ప్రతీ విభాగంలోనూ ప్రత్యర్థి కంటే భారతే బలంగా ఉండటంతో ఇంటా బయటా బంగ్లాపై టీమిండియానే విజయం సాధిస్తూ వచ్చింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్, అనుభవజ్ఞులైన పేస్ దళం, నాణ్యమైన స్పిన్నర్లు ఇలా తుది 11 మంది దాకా భారత్ ప్రత్యర్థి కంటే ఎంతో దుర్బేధ్యమైంది. ప్రస్తుత జట్టులో విశ్రాంతి వల్ల రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక్కడే అందు బాటులో లేడు. కానీ అతడి వెన్నంటే నిలిచిన యావత్ జట్టంతా అస్త్ర శస్త్రాలతో రెడీగా ఉంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా సమరానికి సై అంటోంది.
ఇదిలా ఉండగా భారత్‌తో సిరీస్‌కు సమాయత్తం అవుతుండగానే బంగ్లా క్రికెట్‌లో ముసలం రేగింది. ఆటగాళ్లంతా ఉన్న పళంగా సమ్మె బాట పట్టారు. తమ కాంట్రాక్టు ఫీజులు పెంచక పోతే ఏ రకమైన క్రికెట్ అడేది లేదని బీసీబీతో తెగేసి చెప్పారు. చివరకు ఒప్పించి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుండగా, మేటి ఆల్‌రౌండర్, కెప్టెన్ షకీబుల్ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి వేటు వేసింది. బుకీలు అతన్ని సంప్రదించిన విషయాన్ని ఐసీసీ అవినీతి నిరోధక విభాగానికి చెప్పలేదని రెండేళ్ల నిషేధం విధించింది.
ఎంతో అనుభవజ్ఞుడైన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కీలకమైన సిరీస్‌కు దూరం కావడంతో బంగ్లా ఒక్కసారిగా ఒత్తిడికి గురైంది. షకీబ్ ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అసాధారణంగా రాణించాడు. సొంత గడ్డపై ప్రేక్షకుల మద్దతుతో టి20 మెరుపులు మెరిపించేందుకు రోహిత్ సేన సిద్ధంగా ఉంది. అనుభవజ్ఞులైన రోహిత్, శిఖర్ ఓపెనింగ్ జోడీకి సత్తాగల కుర్రాళ్లు శ్రేయస్, మనీశ్, రిషభ్, సంజూ శ్యాంసన్, కృనాల్ పాండ్యాలు జతయ్యారు. వీళ్లంతా పట్టుదలతో ఉన్నారు. మొత్తం మీద క్రికెట్ వార్ కు అంతా రెడీగా ఉన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి