ఆర్టీసీకి లైన్ క్లియర్..విలీనానికి జగన్ ఒకే

తాను మాటా మీద నిలబడే వ్యక్తినని మరోసారి ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ప్రూవ్ చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చారు. మాట ఇచ్చినట్టు గానే ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా విలీన ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్. రోడ్డు రవాణా సంస్థగా ఉన్న ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రజా రవాణా శాఖ గా మార్చేందుకు మొదటి అడుగు పడింది. ఆర్టీసీ ఇన్‌చార్జ్‌ ఎండీ, వీసీ నేతృత్వంలో విజయవాడ ఆర్టీసీ బస్‌ భవన్‌ లో జరిగిన పాలక మండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీలో పని చేస్తున్న ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి కార్మికుడు వరకు మొత్తం 52 వేల మందిని పీటీడీలో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సిబ్బంది పదవీ విరమణ వయస్సుని 60కి పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికీ పాలక మండలి పచ్చ జెండా ఊపింది. ఆర్టీసీలో మెడికల్‌ అన్‌ ఫిట్‌ అయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్న 2015 నాటి సర్క్యులర్‌ను రద్దు చేసినట్లు సమాచారం. అదే విధంగా గతంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న ఆర్టీసీ సిబ్బందికి ఇచ్చే ఇంక్రిమెంట్‌ను శాశ్వతంగా రద్దు చేసింది. గతంలో ఎండీగా ఉన్న సురేంద్రబాబు స్థానంలో ప్రస్తుత ఇన్‌చార్జి ఎండీ కృష్ణబాబును చేర్చు కునేందుకు బోర్డు అంగీకరించింది. విశాఖలోని ఎంవీపీ, పుట్టపర్తి బస్‌ స్టేషన్లలోని రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్ల లైసెన్స్‌ను వరుసగా 3, 10 ఏళ్లు పొడిగిస్తూ నిర్ణయించారు. అనపర్తి బస్‌ స్టేషన్లోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు వసతిని ఐదేళ్లుకు పొడిగించారు.

350 ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశ పెట్టేందుకు ఇప్పటికే పిలిచిన టెండర్ల ప్రక్రియకు, 2018-19 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. కారుణ్య నియామకాల దరఖాస్తుకు కాల పరిమితి విధించింది. ఆర్టీసీ ఎంప్లాయిస్‌ రిక్రూట్‌మెంట్‌ రెగ్యులేషన్స్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టును రద్దు చేసింది. కడపలో ఆర్టీసీ ఆసుపత్రి నిర్మాణానికి బోర్డు ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌ బీహె చ్‌ ఈఎల్‌లో నిర్మాణంలో ఉన్న ఏపీఎస్‌ ఆర్టీసీ డిపోలో సిబ్బంది కోసం డార్మెటరీ నిర్మాణానికి, పుంగనూరులో ఆర్టీసీ డిపో నిర్మాణానికి పచ్చ జెండా ఊపింది.గవర్నర్‌పేట 2 డిపో పరిధిలో ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చిన 2836 చదరపు మీటర్ల ల్యాండ్‌ లీజు అగ్రిమెంటు రద్దుకు బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం మీద ఆర్టీసీ కార్మికులకు ఇప్పుడు పండగే అన్నమాట.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!