ఆత్మహత్యలకు పాల్పడొద్దన్న గవర్నర్ - వెల్లడించిన అశ్వత్థామ
తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది. మరో వైపు సమ్మెను విచ్చిన్నం చేసేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు. అంతకు ముందు అశ్వత్థామ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ను కలిశారు. ఈ సందర్బంగా గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోవడం లేదని, కార్మికులు చనిపోతున్నా స్పందించలేదని గవర్నర్ కు విన్నవించారు. దీంతో జోక్యం చేసుకున్న గవర్నర్ సమస్య గురించి తనకు తెలుసనీ, త్వరలో పరిష్కరిస్తానని, కానీ కార్మికులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దంటూ సూచించారని ఆర్టీసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి చెప్పారు.
తమ వద్ద డబ్బులు లేవంటూ కోర్టుకు ఏజీ చెప్పడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. బస్సులు ఫుల్ గా నడిపిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం మరి వచ్చిన డబ్బులను ఎవరి జేబుల్లోకి మళ్లించిందో చెప్పాలని ప్రశ్నించారు. విలువైన ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క గజం స్థలం కూడా పోనివ్వమని అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు. తమ సమ్మెకు, ఆందోళనకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని, తాము చేసే అన్ని కార్యక్రమాలకు సకల జనులు సపోర్ట్ ఇవ్వాలని ఆయన కోరారు.
ఇదిలా ఉండగా గవర్నర్ తమిళిసై మాత్రం తమ పట్ల సానుభూతితో ఉందని, ఆమెకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నామని జేఏసీ నేతలు తెలిపారు. అంతకు ముందు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంతటా ఆందోళన చేపట్టింది. ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తం గా మారింది. జగ్గారెడ్డి ఆటోలో రాగా, రేవంత్ రెడ్డి మోటార్ సైకిల్ పై వచ్చారు. పలు చోట్ల కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేశారు. మొత్తం మీద కార్మికులకు మాత్రం అంతకంతకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతోంది. విద్యా సంస్థలు తెరుచు కోవడంతో స్టూడెంట్స్ కు ఇబ్బందులు తప్పేలా లేవు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి