అర్దాకలిలో విద్యా వలంటీర్లు
ఆరేళ్ళు గడిచినా తెలంగాణాలో విద్యా వ్యవస్థ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది. ఈరోజు వరకు విద్యా శాఖలో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా నేటి దాకా ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు. వారి స్థానంలో అతి తక్కువ వేతనాలకు విద్యా వాలంటీర్లను గతంలో నియమించింది. టెట్ తో పాటు బిఇడి, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని కఠినతరమైన నిబంధనలు విధించారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 15000 లకు పైగా ప్రొఫెషనల్ గా అన్ని అర్హతలు, అనుభవం కలిగిన వారు ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ టీచర్స్ తో సమానంగా, అంత కంటే ఎక్కువగా విధులు నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు.
అయితే కాంట్రాక్టు పద్ధతిన నియమించిన విద్యా వాలంటీర్లను ఎప్పుడు పడితే అప్పడు తీసివేసేలా నిబంధనలు రూపొందించింది ప్రభుత్వం. ఎన్నికల సమయంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో జాబ్స్ అంటూ ఉండబోవని చెప్పారు. తీరా కొలువు తీరాక దాని ఊసే ఎత్తడం లేదు. పొరుగున తాజాగా కొలువు తీరిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏకంగా అన్ని ఖాళీలను భర్తీ చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాడు. కొలువుల భర్తీలో ఆయన ఇండియాలోనే టాప్ పొజిషన్ లో ఉన్నాడు. కానీ తెలంగాణాలో అందుకు భిన్నంగా ఉంది. చాలీ చాలని జీతం ఇస్తూ విద్యా వాలంటీర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. గత ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా తొక్కిపెట్టింది ఈ సర్కార్.
ఇటీవల విద్యా వలంటీర్ల జీతాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ విద్యా వలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వంపై వత్తిడి తీసుకు రావడంతో ఇటీవలే విడుదల చేసింది. ఒక్కో విద్యా వాలంటీర్ కు నెలకు కేవలం 12 వేల రూపాయలు మాత్రమే ఇస్తుండడంతో చాలీ చాలని బతుకులు బతుకుతున్నారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, విద్యా హక్కు చట్టం ప్రకారం వేతనాలు ఇవ్వాలని, తమను ఇతర కెజిబివి పాఠశాలల్లో లేదా మోడల్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో కొనసాగేలా లేదా ఇతర ప్రభుత్వ శాఖలలో టీచింగ్, నాన్ టీచింగ్ విభగాల్లోకి మార్చాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వానికి, మంత్రులకు, సంబంధిత ఉన్నత శాఖాధికారులకు వినతి పత్రం అందజేశారు రాష్ట్ర విద్యా వలంటీర్ల సంఘం ప్రెసిడెంట్. మొత్తం మీద వెట్టి చాకిరీ చేస్తూ విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని బాధితులు కోరుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి