భవిష్యత్తు కోసం కలిసి నడుద్దాం


మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ లో గొడవలు ఉన్నాయని, మీరెందుకు వెళ్లడం లేదంటూ నాపై ప్రశ్నల వర్షం కురుస్తోంది, దీంతో స్పందించక తప్పడం లేదు. మా అధ్యక్షుడిగా వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకున్నదని నటుడు నరేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన స్వంతంగా తన వివరణతో ఓ వీడియో విడుదల చేశారు. గత 25  ఏళ్లలో ఎప్పుడూ ‘ఎమర్జెన్సీ జనరల్‌ బాడీ మీటింగ్‌’ జరగలేదు. నేను షూటింగ్‌లో ఉండగా ‘ఎమర్జెన్సీ మీటింగ్‌ నిర్వహిస్తున్నాం.. మీరు రావాలి’ అంటూ నాకు ఓ లెటర్‌ వచ్చింది. ‘మా’ అధ్యక్షుడిగా జనరల్‌ బాడీని ఆహ్వానించాల్సిన బాధ్యత నాకే ఉంది. కొత్త కమిటీ ఎంపికై 6 నెలలు కూడా కాక ముందే ఈ జనరల్‌ బాడీ ఎందుకు జరుగుతోంది? అవసరం ఉందా?  పైగా, నేను పిలవాల్సిన దాన్ని ఎవరో పిలిచారు కాబట్టి దానికి నేను వెళ్లడం సబబు కాదని కొందరు పెద్దలు నాకు చెప్పారు.

రెండు మూడు రోజుల తర్వాత ఇది ఫ్రెండ్లీ సమావేశమని చెప్పారు. ఈ సమావేశానికి అధ్యక్షుడిగా నేను హాజరు కావాల్సిన అవసరం లేదు. సంక్రాంతికి విడుదల కానున్న ఓ సినిమాలో 30  మంది ఆర్టిస్టుల కాంబినేషన్‌ సీన్స్‌ కోసం నేను డేట్స్‌ ఇచ్చాను కాబట్టి షూటింగ్‌లో ఉన్నా. జనరల్‌ బాడీ మీటింగ్‌ జరుగుతోందని మళ్లీ ఓ సర్క్యులర్‌ వచ్చింది. ఈ సమావేశానికి  నేను అడ్డుపడు తున్నానంటూ రాశారు. ‘మా’ కార్యక్రమాలకు అధ్యక్షుడిగా నేనెందుకు అడ్డుపడతాను? ఇది ఏ సమావేశమో తెలియకుండా నేను వెళితే అక్కడ జరిగే పరిణామాలకు నేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది పనికి రాని ఓ సమావేశం అంటూ ఈసీ మెంబర్‌ పృథ్వీ కూడా పేర్కొన్నారు.. ఇందుకు ఆయన్ని నేను తప్పుబట్టడం లేదు.

కొందరేమో ఇది ఫ్రెండ్లీ మీటింగ్‌ అంటున్నారు.. అక్కడి ‘మా’ ఫ్లెక్సీల్లో నేమో సర్వసభ్య సమావేశం అని ఉంది. ఫ్రెండ్లీ సమావేశంలో పాల్గొన్న ఓ న్యాయవాది ‘మా’ బైలాస్‌ మార్చాలి, పనికి రాని పాయింట్లు ఉన్నాయని చెప్పడం బాధగా అనిపించింది. పైగా ఎమర్జెన్సీ మీటింగ్‌ పెట్టాలంటే 20  శాతం సభ్యులు ఆమోదించాలని ప్రింటెడ్‌ కాపీలతో వచ్చారంటే ఇది ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతోందని తెలుస్తోంది. ప్రభుత్వంతో చర్చించి పేద కళాకారులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్లు వచ్చేందుకు కృషి చేస్తున్నాం. 2 కోట్లతో ఓ కార్యక్రమం నిర్వహించనున్నాం. 30  లక్షలు బ్యాంకులో ఉంది, మరో 1.70  కోట్లు బ్యాంకుకు రానుంది.. వేడుకకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు అందరూ ముందుకు రావాలి.. ‘మా’ సంస్థ భవిష్యత్తు కోసం కలిసి కట్టుగా కృషి చేయాలని నరేష్ కోరారు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!