రేవంతా మజాకా - ఖాకీలకు ఝలక్


డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులకు చుక్కలు చూపించాడు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పోలీసులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి నుంచే మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి నివాసం వద్ద పికెట్‌ ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత పెట్టారు. తెల్లవారు జామున రేవంత్‌ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం పది గంటల తర్వాత రేవంత్‌ అనుచరులు ఒక్కొక్కరుగా వచ్చారు. అనుచరులు ఎప్పట్లా సాధారణంగానే ఉన్నారు. దాంతో, పోలీసులు కాస్త రిలాక్స్‌ అయ్యారు. ఇదే అదనుగా రేవంత్‌ మెరుపు వేగంతో బయటకు వచ్చారు.

అడ్డుకోబోయిన పోలీసులను అనుచరులు 15 సెకన్ల పాటు నిలువరించారు. పరుగులు తీసుకుంటూ రేవంత్‌ పెద్దమ్మ దేవాలయం వెనక రోడ్డు వరకు వచ్చారు. అప్పటికే అక్కడ ద్విచక్ర వాహనంతో అనుచరుడు సిద్ధంగా ఉన్నాడు. రేవంత్‌ దానిపై కూర్చున్నారు. ఓ పోలీసు అడ్డుకున్నా.. అనుచరులు తప్పించారు. అనుచరుడు డ్రైవ్‌ చేస్తుండగా.. ద్విచక్ర వాహనంపై దూసుకెళ్లిన ఆయన.. హోటల్‌ కాకతీయ ముందుకు చేరుకున్నారు. అక్కడ ద్విచక్ర వాహనం దిగి డివైడర్‌ దాటుతుండగా, పోలీసులు అడ్డుకున్నారు. వారిని తోసుకుంటూ వెళ్లి ప్రగతి భవన్‌ వద్దకు రేవంత్‌ చేరుకున్నారు. గేటును టచ్‌ చేశారు. సరిగ్గా ప్రగతి భవన్‌ ముఖద్వారం ముందు నిలబడి పెద్దఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే అక్కడున్న పోలీసులు రేవంత్‌ను అరెస్టు చేసి కామాటిపురా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా రేవంత్‌.. ‘కేసీఆర్‌ నశించాలి.. చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి’ అని నినాదాలు చేశారు. పోలీసులకు రేవంత్‌ చుక్కలు చూపించారు. ఇక, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ ప్రగతి భవన్‌ దాకా వచ్చి అరెస్టయ్యారు.ఎన్‌ఎ్‌సయూఐ, యువజన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలూ ప్రగతిభవన్‌ సమీపం వరకూ వచ్చి ముట్టడించే ప్రయత్నం చేశారు. భట్టి విక్రమార్క, జానారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం, సంపత్‌ కుమార్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి తదితరులను గృహ నిర్భంధం చేశారు. వివిధ జిల్లాల్లో వందలాది మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు.

ప్రగతి భవన్‌కు వచ్చే మార్గంలో వేలాది మంది పోలీసులను మోహరించారు. కొందరు పోలీసుల కళ్లుగప్పి ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో ప్రగతి భవన్‌ వైపు దూసుకొచ్చారు. ప్రగతి భవన్‌ను టచ్‌ చేశామని, సీఎం కేసీఆర్‌ తన నియంతృత్వ పోకడలను వీడకుంటే 4 కోట్లమంది ప్రజలు ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టుడు ఖాయమని రేవంత్‌ స్పష్టం చేశారు. కేసీఆర్‌ని ప్రజలు త్వరలో ఇంటికి పంపిస్తారన్నారు. కార్మిక సంఘాల నేతలను పిలిచి చర్చలు జరపాలని, అరెస్టులతో కాంగ్రెస్‌ నాయకులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. మొత్తం మీద కాంగ్రెస్ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం సక్సెస్ అయ్యింది. ఈ సందర్బంగా ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి, థామస్ రెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!