ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతం


హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్‌ ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం అయిదు గంటలకు ముగిసింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మట్టంపల్లి మండలం గుండ్లపల్లిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది. ఉప ఎన్నిక ఫలితాన్ని 24న ప్రకటిస్తారు. కాగా పోలింగ్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు భారీగా పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం 5 గంటల్లోపు క్యూలైన్లలో వేచి ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించారు. కాగా సాయంత్రం 4 గంటల వరకు 75 శాతం పోలింగ్‌ నమోదైంది.

మధ్యాహ్నం 3 గంటల వరకు 70 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, గత ఎన్నికల్లో ఇక్కడ 88 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. చింతలపాలెం మండలం కృష్ణాపురంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పద్మావతి ఉత్తమ్‌ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పద్మావతి గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కాంగ్రెస్‌- టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలను చెదర గొట్టారు. ఇక పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు అసహనంతో వెనుదిరిగారు. ఉప ఎన్నిక సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ గరిడేపల్లి మండలం పోనుగొడు ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఉత్తమ్ పద్మావతి పోలింగ్‌ సరళిని పరిశీలిస్తూ నియోజకవర్గాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా తన ఓటు కోదాడలో ఉండటంతో ఇక్కడ ఓటు వేయలేక పోతున్నందుకు బాధగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పోలింగ్‌ పూర్తయ్యేలా చూడాలని ఆమె ఓటర్లకు విఙ్ఞప్తి చేశారు. మరో వైపు నేరేడుచర్ల మండలంలోని చింతబండలో రెండు ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌ను నిలిపివేసి...అధికారులు ఈవీఎంలను సరి చేశారు..తర్వాత పోలింగ్ స్టార్ట్ అయ్యింది. పోలింగ్‌ సరళిని జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ దగ్గరుండి పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

ఆయన భార్య పద్మావతి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సైదిరెడ్డిని తమ అభ్యర్థిగా నిలబెట్టింది. బీజేపీ కోటా రామారావుకు బీఫాం ఇచ్చి బరిలో నిలిపింది. ఇక ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక కేసీఆర్‌ సర్కారుకు సవాలుగా మారింది. కార్మికులను పట్టించుకోకుండా నియంతృత్వ ధోరణి అనుసరిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ఎన్నిక ఫలితాలను రిఫరెండంగా తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో ఉప ఎన్నికపోరు రసవత్తరంగా మారింది. అయితే సర్వే సంస్థలు, ప్రభుత్వం మాత్రం అధికార పార్టీదే గెలుపు ఖాయమని స్పష్టం చేయడం గమనార్హం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!