ఇండియా వైట్ వాష్ - సఫారీలకు షాక్
అంతా అనుకున్నట్టే జరిగింది. రాంచీలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో 202 పరుగుల ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసుకుంది. కోహ్లీ సేన స్వంత గడ్డపై మూడు టెస్టులు గెలిచి రికార్డ్ సృష్టించింది. టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. తొలి రెండు టెస్టులను సునాయాసంగా గెలిచిన టీమిండియా.. మూడో టెస్టులో సైతం అదే జోష్ కనబరిచి సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. టెస్టు ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాను భారత్ క్లీన్‌స్వీప్ చేయడం ఇదే మొదటి సారి.
టెస్టు ఫార్మాట్‌లో ఇరు జట్ల ముఖాముఖి పోరులో దక్షిణాఫ్రికానే పైచేయి ఉండగా, స్వదేశంలో జరిగే టెస్టుల విషయంలో టీమిండియాదే పైచేయిగా ఉంది. నాల్గో రోజు ఆటలో భాగంగా 132/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మరో ఒక పరుగు మాత్రమే సాధించి ఆలవుట్ అయ్యింది. కేవలం 12 బంతుల్లోనే దక్షిణాఫ్రికా చివరి రెండు వికెట్లను టీమిండియా పడగొట్టి సిరీస్‌లో తమకు ఎదురులేదని నిరూపించింది. బ్రుయిన్ తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఎన్‌గిడీ డకౌట్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా కథ ముగిసింది.
చివరి రెండు వికెట్లను నదీమ్ సాధించాడు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు సాధించగా, ఉమేశ్ యాదవ్, నదీమ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. జడేజా, అశ్విన్‌లకు చెరో వికెట్ లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 335 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో సఫారీకి ఫాలో ఆన్ తప్పలేదు. ఈ భారీ విజయంతో వరల్డ్ టెస్ట్ రేటింగ్స్ లో టీమిండియా 240 పాయింట్లు సాధించి మొదటి ప్లేస్ లో నిలిచింది. మొత్తంగా చూస్తే భారత జట్టు అటు బౌలింగ్ లోను ఇటు బ్యాటింగ్ లోను అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి