ఆంగ్ల మాధ్యమం..అభివృద్ధికి సోపానం
ఆంగ్లం అన్నది అదేదో పెనుభూతం అని అనుకోవద్దు. ప్రపంచంలో మనం రాణించాలంటే ఇంగ్లిష్ నేర్చు కోవడం తప్పనిసరి. దీనిని తప్పుగా అర్థం చేసుకోకండి. అలా అని తెలుగు భాషకు మొదటి ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తుందని స్పష్టం చేశారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. మన పిల్లలు కూడా గొప్ప పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో చదవాలని ఆరాటపడి వారం క్రితం జీఓ విడుదల చేయగానే, ఏం జరుగుతోందో మనందరం చూస్తున్నామని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారికి ఇంగ్లిష్ మీడియం ఎందుకని, తెలుగు మీడియం చాలదా అనే స్వరాలు వినిపిస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న వారిని ఉద్దేశించి ఆయన అన్నారు.
విజయవాడలో ఆజాద్ 132వ జయంతి సందర్భంగా జాతీయ విద్యా, మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో సీఎం మాట్లాడారు. దేశ తొలి విద్యా మంత్రిగా ఎనలేని సేవలందించిన ఆజాద్ జయంతిని, అప్పట్లో మహానేత వైఎస్సార్ 2008లో అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ దినోత్సవంగా ప్రకటించారని జగన్ గుర్తు చేశారు. మౌలానా11 ఏళ్ల పాటు ఎన్నో మంచి పనులు చేశారని, నేడు ఉన్న పలు విద్యా సంస్థలు ఆయన ప్రారంభించిన వేనని తెలిపారు. నా సుదీర్ఘ 3,648 కి.మీ పాద యాత్రలో పేదల గుండె చప్పుడు విన్నాను. వారి కష్టాలు స్వయంగా చూశాను. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యులున్నారు.
ఇదే సమయంలో దేశంలో సగటున అది 27 శాతం మాత్రమే. ఈ పరిస్థితి మారాలి. మనం ఇంగ్లిష్ మీడియంలో చదవక పోవడం వల్ల చాలా నష్టపోయాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. పిల్లలు బాగా చదువుకున్నప్పుడే పేద కుటుంబాల బతుకు మారుతుంది. ప్రతి పేదవాడి ఇంట్లో ఓ ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ తయారైతేనే వారి జీవితాలు మారుతాయి. అందుకే ఆ దిశగా పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రానున్న విద్యా సంవత్సరం నుంచి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేస్తాం. తెలుగు, ఉర్దూలలో ఏదో ఒక భాష తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుంది.
ఆ తర్వాత ప్రతి ఏడాది 7,8,9,10 తరగతుల్లో వరుసగా ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తాం. ఆ విధంగా మన పిల్లలు నాలుగేళ్లలో ఇంగ్లిష్ మీడియంలో ఐసీఎస్‌ఈ, సీబీఎస్‌ఈ వంటి పరీక్షలు చక్కగా రాయ గలుగుతారు అని అన్నారు.
14న ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్ట బోతున్నాం. రాష్ట్రంలో 45 వేల స్కూళ్లు ఉండగా, వాటిలో 15 వేల స్కూళ్లలో నాడు,నేడు కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి స్కూల్‌లో బాత్‌రూమ్‌లు, బ్లాక్ బోర్డులు, ఫ్యాన్‌లు, ప్రహరీ, మంచి నీరు, లైట్లు వంటి అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తాం. స్కూళ్లలో ఇంగ్లిష్ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
స్కూళ్ల దగ్గర నుంచి మొదలయ్యే విప్లవాత్మక మార్పులు ఉన్నత విద్య వరకు విస్తరిస్తాం. తద్వారా పిల్లలు ఉద్యోగాలకు దగ్గరయ్యే విధంగా మార్పులు చేస్తాం. అన్ని కోర్సుల్లో ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్ అమలు చేయ బోతున్నాం. ఉన్నత విద్యలో పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేస్తాం. హాస్టల్, మెస్ చార్జీల కింద 20 వేలు ఇస్తాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ డిసెంబర్ లేదా వచ్చే జనవరిలో ‘అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా 15 వేలను వారికి ఒక తమ్ముడిగా, ఒక అన్నగా చేతిలో పెడతాను.
మదర్సాలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అందు కోసం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలని అ«ధికారులను ఆదేశించాం. అక్కడ వారు బోధిస్తున్న భాషతో పాటు ఇంగ్లిష్ మీడియంలో విద్యను అభ్యసించాలి. అందుకు వారు ఒప్పుకుంటే అమ్మ ఒడి పథకం కూడా అమలు చేస్తాం. గతంలో పెళ్లికానుక అని చంద్రబాబు పెట్టిన పథకం ఆగిపోయింది. ఆయన ఎన్నికల ముందు ప్రకటించిన ఏ పథకం కూడా అమలు కాలేదు. అందుకే వైఎస్సార్ పెళ్లికానుక అమలు చేస్తాం. గతంలో ఇచ్చిన 50 వేలకు బదులు రెటింపు మొత్తంలో లక్ష రూపాయలు సహాయం చేస్తాం. పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలన్నీ నాకు గుర్తున్నాయి. మార్చి వరకు సమయం ఇస్తే అమలు చేస్తాను అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి