సమ్మె సహజం..విరుద్ధమని ప్రకటించ లేం
ఆర్టీసీ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. కార్మిక సంఘాల సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించ లేమని, అది తమ పరిధిలోని వ్యవహారం కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం పరిధిలోకి ఆర్టీసీ రాదని స్పష్టం చేసింది. ఆర్టీసీ ప్రజో పయోగ సర్వీసుల పరిధిలోకి వస్తుందని, ఒకవేళ ఎస్మా కింద చర్యలు తీసు కోవాలంటే ఆర్టీసీని అత్యవసర సేవల పరిధిలోకి తీసుకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని పలుమార్లు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలను కోరామని, ఏ ఒక్కరూ పంతాన్ని వీడి సమస్య పరిష్కారానికి మెట్టు దిగ రావడానికి ఇష్ట పడనప్పుడు తాము చేయగ లిగిందేమీ లేదంది.
చర్చల అంశం ముగిసిందని, దానిపై ఇక చర్చ అవసరం లేదని పేర్కొంది. చర్చలు జరపాలంటూ ఇకపై తాము ఎవరినీ కోరబోమని, ఈ వ్యవహారాన్ని చట్ట పరిధిలోనే తేలుస్తామంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ కొనసాగించింది. కార్మిక సంఘాల తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. ఆర్టీసీ అంశంపై సీఎస్ అఫిడవిట్ దాఖలు చేయడంతోపాటు కార్మిక సంఘాలతో చర్చలు జరిపినా ప్రయోజనం ఉండదన్నారని చెప్పారు.
దర్మాసనం స్పందిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని తాము సీఎస్‌కు చెప్ప లేదంది. చర్చల విషయంలో ఎవరూ మంకుపట్టు వీడలేదు. ఇలాంటి విషయాల్లో పంతం వీడి ఓ మెట్టు దిగి రావాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఇక చర్చల విషయం మాకు అనవసరం. ఈ వ్యవహారంపై ఇక చట్టపరంగానే విచారణ జరుపుతాం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించే అధికారం హైకోర్టు కుందా, లేక లేబర్ కోర్టుకుందా చెప్పాలని ప్రకాశ్‌రెడ్డిని కోరింది. చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందో లేదో కూడా చెప్పాలంది.
‘రాజీ విఫలమైనప్పుడు సంబంధిత అధికారి ప్రభుత్వానికి నివేదించారు. ఆ నివేదికను లేబర్ కోర్టుకు పంపాలా వద్దా అన్నది ప్రభుత్వమే తేల్చుకోవాలి. లేదంటే ఆ నివేదికను లేబర్ కోర్టుకు పంపాలని ఆర్టీసీ హైకోర్టును కోరవచ్చు. ఆర్టీసీ యాజమాన్యం అలా కోరలేదు. అలాంటప్పుడు మేం ఆదేశాలు ఎలా ఇవ్వగలం. యంత్రాలు వెళ్లలేని చోటుకు మూర్ఖులే వెళతారు. మేం అలా వెళ్లదలచు కోలేదు. రాజ్యాంగానికి, చట్టాలకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తాం. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఉద్వేగాలు, సానుభూతి ఆధారంగా కేసులను తేల్చడం సాధ్యం కాదు.
ఈ మొత్తం వ్యవహారాన్ని ఇకపై చట్ట పరిధిలోనే తేలుస్తాం అని ధర్మాసనం తెలిపింది. అత్యవసర సేవల విభాగంలో ఉన్న వారు సమ్మెకు వెళ్లరాదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా గతంలో చెప్పిందన్నారు. ఈ వాదనను ధర్మాసనం తోసి పుచ్చింది. ఆర్టీసీ అత్యవసర సేవల పరిధిలో లేదని, కేవలం ప్రజోపయోగ సేవల పరిధిలో ఉందని గుర్తు చేసింది. పారిశ్రామిక వివాదాల చట్ట నిబంధనల ప్రకారం రాజీ ప్రయత్నాలు జరుగుతుండగానే కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయని, ఇది చట్ట విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు. సమ్మె ప్రాథమిక హక్కు. దానిని కాదనే అధికారం లేదు. ఇక కోర్టు పరిధిలోనే తేల్చుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి