దివి కేగిన దిగ్గజం
అధికారం ఉన్నది ప్రజల కోసమేనని చాటి చెప్పిన ధీశాలి టీ.ఎన్.సెషన్ ఇక లేరు. కోట్లాది మంది ప్రజలకు ఎన్నికలు అంటే ఏమిటో, దాని వెనుక ఉన్న పవర్ ఏమిటో తెలియ చెప్పిన ఇలాంటి అధికారి మళ్ళీ రారు. దేశ ఎన్నికల ముఖ చిత్రంపై తన దైన ముద్ర వేశారు. కీలక సంస్కరణలకు ఆద్యుడిగా పేరు పొందిన, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ తిరు నెల్లయ్ నారాయణ అయ్యర్ శేషన్ కన్ను మూశారు. వృద్ధాప్యం కారణంగా కొన్నేళ్లుగా ఇంటికే పరిమితమైన ఆయన చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. తమిళనాడు కేడర్‌కు చెందిన 1955 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన శేషన్ 1990–96 సంవత్సరాల్లో 10వ సీఈసీగా పనిచేశారు.
కేరళలోని పాలక్కాడ్‌లోని తిరునెల్లయ్‌లో 1932లో జన్మించారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, అక్కడే డెమాన్‌స్ట్రేటర్‌గా మూడేళ్ల పాటు పని చేసి, ఆ సమయంలోనే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. అనంతరం హార్వర్డ్ వర్సిటీలో 1968లో ప్రభుత్వ పాలనలో పీజీ చేశారు. తమిళనాడుతో పాటు, కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. సీఈసీకి ముందు ఆయన అత్యంత కీలకమైన కేబినెట్ సెక్రటరీగా, ప్రణాళికా సంఘం సభ్యునిగా కూడా ఉన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న కాలంలో నలుగురు ప్రధానులు చంద్రశేఖర్, పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, హెచ్‌డీ దేవెగౌడ మారారు. శేషన్ ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా చాలా క్లుప్తంగా మాట్లాడే వారని పేరు. 1997 రాష్ట్రపతి ఎన్నికల్లో కే.ఆర్. నారాయణన్‌పై ఆయన పోటీ చేశారు. ఎన్నికల విధానంలో పారదర్శకత సాధించేందుకు చేసిన కృషికి గాను ఆసియా నోబెల్‌గా భావించే ప్రతిష్టాత్మక రామన్ మెగసేసే అవార్డును ఆయన అందుకున్నారు.
శేషన్ మృతికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆయన్ను లెజెండ్ అని శ్లాఘించారు. శేషన్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అంకితభావం, నిజాయితీ, నిర్భీతికి శేషన్ నిలువు టద్దమని కొనియాడారు. పబ్లిక్ సర్వెంట్‌గా శేషన్ సేవలు చిరస్మరణీయమన్నారు. ఎన్నికల కమిషన్‌కు ఉన్న శక్తిని ప్రజాస్వామ్య సౌధ నిర్మాణానికి ఏ విధంగా ఉపయోగించవచ్చో నిరూపించారని చెప్పారు.
డబ్బు, అధికారం ఎన్నికల సంఘాన్ని కీలుబొమ్మగా మార్చిన రోజుల్లో ఆయన సీఈసీ పగ్గాలు చేపట్టారు. అనేక విప్లవాత్మక చర్యలతో ఎన్నికల సంఘానికి గౌరవం తెచ్చిపెట్టారు. చట్టాన్ని ఉల్లంఘించేందుకు ఎవరూ సాహసించ లేరనేటంత కట్టుదిట్టంగా ఎన్నికల నియమావళిని అమలు చేశారు. ఆయన చర్యల కారణంగా రాజకీయ పార్టీలతో పాటు మీడియా కూడా కొంత ఇబ్బందులకు గురయింది. ఈ రెండు వర్గాలు కలిసి ఆయన్ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సెషన్ సెన్సేషన్ సృష్టించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి