ఢీకొన్న రైళ్లు..హాహాకారాలు..బాధితుల కేకలు


ఘోర ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు. కానీ అడుగడుగునా రైల్వే శాఖాధికారుల బాధ్యతా రాహిత్యం అగుపించింది. రైళ్ల రాక పోకలతో రద్దీగా ఉండే హైదరాబాద్‌ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి. కర్నూలు, సికింద్రాబాద్‌ హంద్రీ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలును లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళుతున్న ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది గాయ పడ్డారు. స్టేషన్‌ కావడం, వేగం తక్కువగా ఉండడంతో అతి పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం చిన్నదే అయినా, దీనిని భారీ తప్పిదంగానే రైల్వే భావిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలుసు కునేందుకు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రాంక్రిపాల్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ దర్యాప్తు చేపట్టనుంది.

కాగా కాచిగూడ స్టేషన్‌లోకి లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్‌ రైలు రెండో నంబర్‌ ప్లాట్‌ ఫామ్‌ పైకి వచ్చి ఆగింది. ప్రయాణికులు దిగి పోయిన తర్వాత సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తోంది. అంతకు ముందే కర్నూలు టౌన్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ కాచిగూడ స్టేషన్‌ వద్దకు చేరుకుంది. అది మూడో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్లాల్సి ఉంది. అది వచ్చిన సమయంలో మరో రైలు ఆ ప్రాంతాన్ని దాటాల్సి ఉండటంతో ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను హోం సిగ్నల్‌ ప్రాంతంలో ఆపి ఉంచారు. అది ఆగిన ప్రాంతం ప్లాట్‌ఫామ్‌కు 500 మీటర్ల దూరంలో ఉంటుంది. 10.30 గంటల సమయంలో దానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

ప్రధాన లైన్‌ మీదుగా వచ్చినందున అది తొలుత ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రాక్, ఆ తర్వాత రెండో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రాక్‌లను దాటుకుని మూడో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రాక్‌పైకి వెళ్లాలి. సిగ్నల్‌ పడగానే ఆ రైలు బయలుదేరి మొదటి ట్రాక్‌ను దాటి రెండో ట్రాక్‌పైకి వచ్చి దాన్ని క్రాస్‌ చేసేందుకు సిద్ధమవుతుండగా.. అప్పటికే రెండో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై నిలిచి ఉన్న ఎంఎంటీఎస్‌ రైలు ఫలక్‌నుమా వైపు ముందుకు కదిలింది. దాని లోకోపైలట్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆ ట్రాక్‌ మీదుగా మరో ట్రాక్‌లోకి క్రాస్‌ అవుతున్న సంగతిని గుర్తించ లేదు. దీంతో ఎంఎంటీఎస్‌ నేరుగా దూసుకెళ్లి ఇంటర్‌సిటీ ఇంజిన్‌ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఇంటర్‌ సిటీ రైలు ఇంజిన్‌ ఎంఎంటీఎస్‌ లోకోపైలట్‌ కేబిన్‌లోకి చొచ్చుకు పోయింది. ఎంఎంటీఎస్‌ తొలి నాలుగు బోగీలు ఎగిరి పట్టాల పక్కన పడిపోగా.. మరో రెండు బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగి పోయాయి. ఇంటర్‌సిటీకి చెందిన మూడు బోగీలు సైతం పట్టాల నుంచి పక్కకు దిగి పోయాయి. ప్రమాద ఘటనలో ఎంఎంటీఎస్‌ ఒక్కసారిగా పెద్ద కుదుపుతో గాలిలోకి ఎగిరి కింద పడటంతో అందులో ఉన్న ప్రయాణికుల్లో దాదాపు 40 మందికి గాయాలయ్యాయి.

బోగీ డోరు వద్ద ఉన్నవారు కొందరు కిందకు పడిపోయారు. ఘటన జరిగిన వెంటనే భయాందోళనలకు గురైన ప్రయాణికులు బోగీల నుంచి దూకి చెల్లా చెదురుగా పారి పోయారు. ఇంటర్‌సిటీ ఇంజిన్‌ చొచ్చు కెళ్లడంతో లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ కేబిన్‌లోనే చిక్కుకు పోయారు. దాదాపు 8 గంటల తర్వాత ఎన్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఆయన్ను బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు. ట్రాక్‌ మారే ప్రయత్నంలో ఉన్నందున ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ వేగం 10 కిలోమీటర్ల లోపే ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎంఎంటీఎస్‌ వేగం 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల మధ్య ఉందని రైల్వే చెప్పారు.

సాధారణంగా ప్లాట్‌ఫామ్‌ నుంచి బయలు దేరి 500 మీటర్ల దూరం వచ్చేసరికి ఎంఎంటీఎస్‌ రైళ్ల వేగం దాదాపు 40 కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది. కానీ ప్రమాదం జరిగిన ప్రాంతం ట్రాక్‌ ఛేంజింగ్‌ పాయింట్‌ కావటంతో అక్కడ వేగం అందులో సగానికి తక్కువే ఉంటుంది. ఇదే ఇక్కడ పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. గాయపడిన వారిలో కొందరు సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. కాస్త ఎక్కువ గాయాలైన 17 మందిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

వారిలో 11 మందికి ఓపీలో చికిత్స చేసి పంపించగా, తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. లోకో పైలట్‌ చంద్రశేఖర్‌తో పాటు మరో క్షతగాత్రుడు సాజిద్‌ను కూడా కేర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మొత్తం మీద రైల్వే శాఖ నిర్లక్ష్యం తేటతెల్ల మైంది.

కామెంట్‌లు