ధోనీ చెక్కిన శిల్పం..చాహర్ అద్భుతం
తన అద్భుతమైన బౌలింగ్ తో దేశం తన వైపు చూసేలా చేసుకున్న చాహర్ ను వెన్నుతట్టి ప్రోత్సహించింది మాజీ సారధి ధోనీనే. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మీటింగ్ లో పేసర్ దీపక్ చాహర్ రాబోయే లీగ్‌లో 14 మ్యాచ్‌లూ ఆడతాడు. ఇక మనం వేరే ఆటగాళ్ల గురించి మాట్లాడుకుందాం అంటూ స్పష్టం చేశారు ధోనీ. అతడిపై ఆయనకున్న నమ్మకం అలానిది. నమ్మకాన్ని చాహర్ వమ్ము చేయలేదు. పదునైన స్వింగ్ బౌలింగ్‌ను ప్రదర్శిస్తూ కేవలం 7.28 ఎకానమీతో కీలక సమయాల్లో వికెట్లు తీసి చెన్నైని విజేతగా నిలపడంలో ప్రధాన పాత్ర పోషించాడు.
మరో రెండు నెలలకే అతనికి భారత జట్టులో చోటు దక్కడం, ఇప్పుడు ప్రపంచ రికార్డు సాధించడం వరకు మిగతా వన్నీ అతని ఐపీఎల్ ప్రదర్శనకు కొనసాగింపు లాంటివే. రంజీ ఆటలో ఇన్నింగ్స్‌లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్ తరఫున 18 ఏళ్ల చాహర్ బరిలోకి దిగగా, 21 పరుగులకే ఆలౌటై రంజీల్లో అతి చెత్త రికార్డు నమోదు చేసిన ఆ జట్టు హైదరాబాద్. అంతటి అద్భుత ఆరంభం తర్వాత కూడా అంతర్జాతీయ క్రికెటర్ అనిపించుకోవడానికి చాహర్‌కు ఎనిమిదేళ్లు పట్టింది.
గాయాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. రాజస్తాన్ క్రికెట్ జట్టు డైరెక్టర్‌గా ఉన్న ఆసీస్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ నువ్వు బౌలర్‌గానే పనికి రావంటూ చాహర్‌ను తిరస్కరించాడు. తండ్రి లోకేంద్ర సింగ్ కుమారుడికి అండగా నిలిచి స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాడు. ఉద్యోగ రీత్యా వారు జైపూర్‌లో స్థిర పడటంతో మొదటి నుంచి చాహర్ రాజస్తాన్ జట్టునే ఎంచుకున్నాడు. వారి సొంత అకాడమీలోనే అతను స్వింగ్ బౌలర్‌గా ఎదిగాడు. కొత్త బంతిని స్వింగ్ చేయడంపైనే అతను పూర్తిగా శ్రద్ధ పెట్టాడు. ఇందు కోసం తండ్రి ఖర్చుకు వెనుకాడకుండా ప్రతీ ప్రాక్టీస్ సెషన్‌కు కొత్త బంతులను సిద్ధం చేసేవాడు.
కెరీర్ ఆరంభంలో 125 కిలోమీటర్ల వేగంతోనే బౌలింగ్ చేసిన దీపక్ ఆ తర్వాత రాటుదేలి, ఫిట్‌నెస్ మెరుగు పర్చుకొని 150 కిలోమీటర్ల స్పీడ్‌కు తన వేగాన్ని పెంచుకున్నాడు. 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో పుణే సూపర్ జెయింట్స్ జట్టులో చాహర్ ఉన్నాడు. తనని ఆడిస్తానంటూ ధోని అప్పుడే మాట ఇచ్చాడు. అయితే లీగ్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయ పడటంతో పక్కన పెట్టాల్సి వచ్చింది. చివరి 3 మ్యాచ్‌లు మాత్రం ఆడగలిగాడు. మరుసటి ఏడాది స్మిత్ కెప్టెన్ కావడంతో అతని ప్రణాళికల్లో చాహర్ పనికి రాలేదు. దాంతో 2 మ్యాచ్‌లే దక్కాయి. ధోని మాత్రం మాటంటే మాటే అంటూ 2018లో చెప్పి మరీ చెన్నై జట్టులోకి తీసుకున్నాడు.
ఐపీఎల్‌లో సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన తర్వాత అంతా మారి పోయింది. రెండు నెలలకే భారత్ తరఫున ఆడే అవకాశం లభించింది. బుమ్రా గాయ పడటంతో ఇంగ్లండ్‌తో బ్రిస్టల్‌లో చాహర్ అరంగేట్రం జరిగింది. భువనేశ్వర్ తరహాలో కొత్త బంతితో స్వింగ్ రాబట్టడం, డెత్ ఓవర్లలో పాత బంతితో కట్టడి చేయడం దీపక్‌కు బాగా అబ్బిన విద్య. సాధారణంగా ఐపీఎల్‌లో పవర్ ప్లే లోని ఆరు ఓవర్లలో మూడు ఓవర్లను చాహర్‌తో ధోని వేయించే వాడు. మొత్తంగా 80 శాతం బంతులు అతను పవర్ ప్లేలో వేసినవే.
ప్రొవిడెన్స్‌లో వెస్టిండీస్‌తో ఆడిన తన రెండో టి20లో 3 ఓవర్లలో 4 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన చాహర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. కెరీర్‌లో తొలి మ్యాచ్ మినహా మిగిలిన 6 మ్యాచ్‌లలోనూ అతను ప్రత్యర్థిని కట్టడి చేయగలిగాడు. ఆసియా కప్‌లో భాగంగా ఏకైక వన్డే ఆడిన చాహర్, టెస్టుల్లోనూ టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నాడు. ప్రపంచ రికార్డు ప్రదర్శనతోనే ఆగి పోకుండా మున్ముందు మరిన్ని అద్భుతాలు చేయగల సత్తా 27 ఏళ్ల దీపక్ చాహర్‌లో ఉందనేది మాత్రం వాస్తవం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి