ప్రతిష్టంభన యథాతథం..ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం
రాజకీయం అంటే ఏమిటో, అది చేసే మాయాజాలం ఎలా ఉంటుందో చూడాలంటే మొదటగా మారాతను చూసి తీరాల్సిందే. తెలుగు సినిమాలు, సీరియల్స్ ను తలదన్నేలా రోజుకో ట్విస్టులతో మాహా ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ బోతోందని, ‘మహా’ ఉత్కంఠకు తెర పడనుందని అంతా భావించారు. నాటకీయ పరిణామాలు, అనూహ్య మలుపులు..ఉత్కంఠను పెంచాయి. మద్దతు లేఖ ఇవ్వకుండా కాంగ్రెస్ ఆఖరి నిమిషంలో ఇచ్చిన ట్విస్ట్‌తో శివసేన కంగుతిని, అధికారానికి అడుగు దూరంలో నిలిచి పోయింది.
మరో 48 గంటలు గడువు ఇచ్చేందుకు గవర్నర్ కోష్యారీ నిరాకరించడంతో రాజ్‌భవన్ నుంచి శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే బృందం నిరాశగా వెను తిరిగింది. ప్రభుత్వ ఏర్పాటు రేసులో ఎన్సీపీ ముందుకు వచ్చింది. ఎన్సీపీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. స్పందించేందుకు 24 గంటల గడువు విధించారు. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు ఏం చేయ బోతున్నాయన్నది సస్పెన్స్‌గా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమై, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతు కోరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చర్చలు కొనసాగాయి.
తొలుత పార్టీ చీఫ్ సోనియా నేతృత్వంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. శివసేనకు మద్దతివ్వాలా, వద్దా ఇస్తే.. ప్రభుత్వంలో చేరాలా, లేక బయట నుంచి మద్దతివ్వాలా, ఎలాంటి షరతులు విధించాలి. ప్రభుత్వంలో చేరడం వల్ల పార్టీకి ఎలా ప్రయోజనకరం తదితర అంశాలపై చర్చించారు. సైద్ధాంతికంగా విభేదాలున్న శివసేనకు మద్దతిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పలువురు నేతలు గట్టిగా వాదించినట్లు తెలిసింది. ప్రభుత్వంలో తమ భాగస్వామ్యం ఉండాలని మెజారీటీ ఎమ్మెల్యేలు కోరుకున్నట్లు సమాచారం.
చివరకు, శివసేనకు మద్ధతిచ్చేందుకు పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ ఖండించారు. ఇదే సమయంలో, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సోనియాగాంధీకి ఫోన్ చేసి, మద్దతు కోరారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్‌తో ముంబైలోని ఒక హోటల్‌లో దాదాపు గంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ లేఖ పంపారు. కాంగ్రెస్ ప్రకటనతో ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతు లభిస్తుందని, వారి నుంచి మద్దతు లేఖలు వస్తాయని ఆశించిన శివసేన ఒక్కసారిగా షాక్ తిన్నది.
గడువు పొడిగించేందుకు గవర్నర్ నిరాకరించారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న మా ప్రతిపాదనను తిరస్కరించలేదు అని ఆదిత్య చెప్పారు. మరోవైపు, మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో శివసేన ఏకైక మంత్రి అరవింద్ సావంత్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము మద్దతివ్వాలంటే ముందు ఎన్డీయే నుంచి వైదొలగాలంటూ శివసేనకు ఎన్సీపీ చేసిన డిమాండ్ నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి