మెట్టు దిగిన జేఏసీ..గట్టు దిగని కేసీఆర్

ఓ వైపు కార్మికులు ఆత్మహత్యలు, బలవంతపు చావులు తెలంగాణలోని జనం పడుతున్న ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ జేఏసీ ఓ మెట్టు దిగొచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం తన పట్టు మాత్రం వీడడం లేదు. రాష్ట్ర ధర్మాసనం సమ్మె విషయంలో ఇరు పక్షాలు ఓ మెట్టు దిగాలని సూచించింది. మరో అడుగు ముందుకు వేసి ఏకంగా చీవాట్లు కూడా పెట్టింది. రిటైర్డ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో ఓ కమిటీని కూడా వేస్తానని చెప్పింది కూడా. దీనికి సైతం కేసీఆర్ ఒప్పు కోలేదు. ఇదే క్రమంలో ప్రైవేట్ రూట్ల పర్మిట్లను గంప గుత్తగా ఇవ్వడాన్ని నిలుపుదల చేస్తూ కోర్టు స్టే విధించింది. ఇక కార్మికుల నుంచి వత్తిళ్లు పెరగడంతో జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డి, థామస్ రెడ్డి లు ఓ మెట్టు దిగేందుకు ఒప్పుకున్నారు.

ఈ మేరకు విపక్షాలు, కార్మిక నేతలతో కలిసి ప్రత్యేక సమావేశం చేపట్టారు. ఇందులో మరో కార్యాచరణను ప్రకటించారు నాయకులు. విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టామని, ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. పోలీసులు మఫ్టీలో వచ్చి జేఏసీ నేతల్ని అరెస్ట్‌ చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అన్ని వర్గాలు సమ్మెకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. మిగతా 25 డిమాండ్ల మీద చర్చ జరపాలని డిమాండ్ చేశారు.  అన్ని గ్రామాల్లో బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తామని, ఇందిరాపార్క్‌ వద్ద జేఏసీ నేతలు దీక్ష చేస్తారని చెప్పారు. అన్ని డిపోల వద్ద నిరసన దీక్షలు చేపడతామని, హైదరాబాద్‌ నుంచి కోదాడ వరకు సడక్‌ బంద్‌ నిర్వహిస్తామని వెల్లడించారు.

చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులతో గవర్నర్‌ని కలుస్తామని, ఎన్‌హెచ్‌ఆర్సీ అపాయింట్‌మెంట్‌ కోరామని అశ్వత్థామరెడ్డి చెప్పారు. కాగా ఆర్టీసీ సమ్మె 41వ రోజుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు డిపోల వద్ద ఆందోళనలు, నిరసనలు, నిరాహార దీక్షలు నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్య లేనని ఆర్టీసీ కార్మికులు నినదిస్తున్నారు. ఇప్పటికే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. తెలంగాణ అంతటా పర్యటనలకు వెళ్లే మంత్రులకు నిరసన సెగ తగులుతోంది.  ఇలాంటి సంఘటనలు అంతటా కొనసాగుతూనే ఉన్నాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!