సోషల్ మీడియాలో సీరియల్ స్టార్స్ హవా

తెలుగు బుల్లితెర మీద ఇప్పుడు సినీ స్టార్స్ కు ఉన్నంత క్రేజ్ సీరియల్ నటీనటులకు ఉంటోంది. వీరికి ప్రత్యేకంగా అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఇప్పటికే సీరియల్స్ క్రియేషన్ లో..టెలికాస్ట్ లో స్టార్ మాటీవీ, జీ తెలుగు, జెమిని టీవీ ఛానల్స్ పోటీ పడుతున్నాయి. ఆయన్ను నేనెంతో ప్రేమించా..నాకింత అన్యాయం చేస్తారను కోలేదు అంటూ కన్నీళ్లు కుమ్మరించి వీక్షకుల కళ్లూ చెమర్చేలా చేస్తున్నారు టీవీ స్టార్స్‌. ఇప్పుడు వీరికి ఏడుపు సన్నివేశాల విరామాల్లో వినోదాన్ని పండిస్తున్నారు. తమ పాపులారిటీని మరింత పెంచుకునేందుకు సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. ఇందులో భాగంగా టిక్‌ టాక్‌...వీమేట్‌..హలో యాప్స్‌ టాప్ రేంజ్ లో కొనసాగుతున్నాయి.

బుల్లితెర నటులు ఈ మధ్య షూటింగ్‌ గ్యాప్‌లో ఫన్నీ వీడియోస్‌ చేస్తూ అప్‌లోడ్‌ చేస్తున్నారు. వీటికి వీక్షకులు, ఫాలోవర్స్‌ సంఖ్య కూడా బాగానే ఉంటోంది. కంట తడి పెట్టించే అభినయంలో నిష్ణాతులైన చిన్ని తెర స్టార్స్‌ వైవిధ్య భరిత అంశాల్లో ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించు కోవడానికి టిక్‌ టాక్‌ వీడియాలను ప్రత్యేకంగా ఎంచుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని, ఫాలోయర్స్‌ని పెంచుకుంటున్నారు. సిటీలో ఎప్పుడూ ఏదో ఒక స్టూడియో లోనో, ఇంట్లోనో చిన్నితెర షూటింగ్స్‌ జరగడం సర్వ సాధారణం. నిన్న మొన్నటి దాకా ఆయా షూటింగ్స్‌లో పాల్గొంటున్న తారలు షాట్‌ గ్యాప్స్‌లో పిచ్చా పాటీ మాట్లాడు కోవడంతో సరిపెట్టు కునే వారు. ఇప్పుడా ముచ్చట్ల స్థానాన్ని టిక్‌ టాక్‌ షూటింగ్స్‌ ఆక్రమించాయి. షూటింగ్‌ గ్యాప్స్‌లో మేకప్‌ సైతం తీయకుండానే సెకన్లు, నిమిషాల వ్యవధి వీడియోలను రూపొందించేస్తున్నారు.

ఎవరితో అయినా కలిసి లేదా ఒంటరిగా వచ్చిన ఐడియా మేరకు వీడియోలు చేస్తున్నారు. షూటింగ్‌ గ్యాప్స్‌లో లాంగ్‌ బ్రేక్స్‌ ఏర్పడినప్పుడు బోర్‌ డమ్‌ పోగొట్టు కోవడానికి ఈ బుల్లి వీడియోలు. చాలా ఉపకరిస్తాయి అని జీ తెలుగు సూర్య వంశం సీరియల్‌ ద్వారా పాపులరైన మీనా వాసు చెప్పారు. చిన్నితెర మెగా నటిగా ఉన్న హరిత టిక్‌ టాక్‌పై కూడా టాప్‌ ప్లేస్‌లో ఉండడం విశేషం. ముద్ద మందారంతో పాటు పలు సీరియల్స్‌లో ప్రేక్షకుల్ని మెప్పించే పాత్రలు పోషిస్తున్న హరిత 3 లక్షలకు పైగా ఫాలోయర్స్‌తో టిక్‌టాక్‌లో పీక్స్‌లో ఉన్నారు. పాట లంటే చాలా ఇష్టం. అయితే సీరియల్స్‌లో పాటలకి పెద్దగా ఆస్కారం ఉండదు కదా. అందుకే టిక్‌ టాక్‌ ద్వారా నచ్చిన పాటలకు అభినయాన్ని జోడిస్తున్నా అంటోంది హరిత.



నటిగా నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగు పరచు కోవడానికి, ఎన్నో భావోద్వేగాలను పలికించడానికి, వినోదం కెమెరాలు, డైరెక్టర్లు, దట్టంగా మేకప్పులు, చాంతాడంత డైలాగులు, కట్స్, కష్టాలు, కన్నీళ్లు, వీటన్నింటికీ భిన్నంగా రూపొందించుకునే ఈ వీడియోల ద్వారా బోలెడంత రిలీఫ్‌ లభిస్తోందని ఈ తారలు చెబుతున్నారు. పెద్దగా వ్యయ ప్రయాసలేవీ లేకుండా నిమిషాల్లో తీసేసి క్షణాల్లో సోషల్‌ మీడియాలోకి అప్‌లోడ్‌ అయిపోతూ చిన్నితెర కన్నా మిన్నగా పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ఓ వైపు నటిస్తూనే మరో వైపు తమ అభినయ సామర్థ్యానికి మరింత సాన బెట్టడానికి ఇది చక్కని అవకాశంగా స్మాల్‌ స్క్రీన్‌ స్టార్స్‌ భావిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!