వాట్సాప్ ఆశలు ఫలించేనా..చెల్లింపులు జరిగేనా
మోడీ కొలువు తీరాక డిజిటల్ చెల్లింపులకు ప్రయారిటీ పెరిగింది. ఈ రంగంలో ఇప్పటికే పలు కంపెనీలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఆన్ లైన్ లావాదేవీలకు ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో కొనసాగుతున్న వాట్సాప్ కూడా ఈజీగా డబ్బులు చెల్లించేందుకు ప్లాన్ చేస్తోంది. డిజిటల్ చెల్లింపుల రంగంలో అవకాశాలను అంది పుచ్చు కునేందుకు, ఇతర ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థలకు ధీటుగా పేమెంట్స్ విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు మెసేజింగ్ యాప్ వాట్సాప్ చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు.
దేశీ చెల్లింపుల సంస్థలు, బ్యాంకులు పాటించే పార దర్శకతను ‘వాట్సాప్ పే’ పట్టించు కోక పోవడం అధికారులకు ఆగ్రహం తెప్పిస్తోంది. పైగా తమ యూజర్లు జరిపే ఆర్థిక లావాదేవీల వివరాలను నిబంధనల ప్రకారం భారత్‌లోనే భద్ర పరుస్తోందా లేదా అన్న విషయాన్ని కూడా వాట్సాప్ సూటిగా చెప్పక పోవడం సంస్థ తీరుపై అనుమానాలకు తావిస్తోంది. చెల్లింపుల వ్యవస్థకు కీలకంగా మారుతున్న ఏకీకృత చెల్లింపుల వ్యవస్థను విని యోగించడానికి వాట్సాప్‌నకు పర్మిషన్ ఇచ్చిన పక్షంలో.. మొత్తం పేమెంట్స్ వ్యవస్థకే ముప్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు ఆందోళన చెందుతున్నాయి.
‘వాట్సాప్ పే’ లో యూజర్ల ఆర్థిక లావాదేవీల వివరాలకు భద్రత ఉండక పోవచ్చని రిజర్వ్ బ్యాంక్ సైతం భావిస్తోంది. భారత యూజర్ల డేటాను స్థానికంగానే భద్ర పర్చాలన్న నిబంధనను వాట్సాప్ పక్కాగా పాటిస్తేనే, పేమెంట్స్ సేవలకు అనుమతించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు స్పష్టం చేసింది. యూపీఐ విధానాన్ని రూపొందించిన ఎన్‌పీసీఐ కొన్నాళ్లుగా వాట్సాప్ పే సేవలపై సానుకూలంగానే ఉంటున్నప్పటికీ, ఆర్‌బీఐ సూచనలతో పరిస్థితి మారేట్లు కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆర్‌బీఐ, ఐటీ శాఖ సంయుక్తంగా ఈ ఆడిట్ చేసే అవకాశాలున్నాయి.
డేటా లోకలైజేషన్ విషయంలో ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాట్సాప్ పేమెంట్ సేవలను నడిపిస్తోందంటూ ఇప్పటికే ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టులో కేసు కూడా వేసింది. ప్రస్తుతం వాట్సాప్ పే ద్వారా చెల్లింపుల విధానం ప్రయోగాత్మక దశలో ఉంది. దీన్ని ఈ ఏడాదే పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టాలని వాట్సాప్ భావించినప్పటికీ .. తాజా పరిస్థితుల నేపథ్యంలో అది ఇప్పుడప్పుడే సాధ్య పడేలా లేదు. ప్రస్తుతం వాట్సాప్‌నకు భారత్‌లో దాదాపు 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. స్పైవేర్ ద్వారా యూజర్లపై నిఘా పెట్టేందుకు వాట్సాప్‌లో లొసుగులు కారణ మవుతున్నాయన్న ఆరోపణలు సైతం కంపెనీకి సమస్యగా మారాయి.
కొందరు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల సమాచారం బయటకు పొక్కిందనే వార్తలతో వాట్సాప్ భద్రతపై సందేహాలు అమాంతం పెరిగి పోయాయి. యూజర్ల డేటాను తస్కరించేందుకు ఉపయోగిస్తున్న పెగాసస్ సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూప్‌పై వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ అమెరికాలో అధికారులకు ఫిర్యాదు కూడా చేసింది. అయినప్పటికీ వాట్సాప్‌పై సందేహాలు నివృత్తి కాలేదు. భారత్‌లో వాట్సాప్ డౌన్‌లోడ్స్ ఏకంగా 80 శాతం పడి పోయాయి. మొబైల్ అనలిటిక్స్ సంస్థ సెన్సార్ టవర్ అధ్యయనం ప్రకారం స్పైవేర్ వివాదం బయటకు రాక ముందు 89 లక్షలుగా ఉండగా, స్పైవేర్ వివాదం వచ్చాక 18 లక్షలకు పడి పోయింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి