లక్ష్మారెడ్డికి లైన్ క్లియర్..?

ప్రొఫెషనల్ గా డాక్టర్ కోర్సు చేసినా రాజకీయాల్లో మాత్రం ఈ వైద్యుడు వెరీ వెరీ స్పెషల్. సౌమ్యుడిగా, సహృదయుడిగా, మౌనంగా తనపని తాను చేసుకుని పోయే మనస్తత్వం కలిగిన పొలిటికల్ లీడర్ గా, తలపండిన రాజకీయ వేత్తగా, మేధావిగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన డాక్టర్ లక్ష్మారెడ్డి కి ఎంతో పేరుంది. తెలంగాణ రాష్ట్రంలో ఆయన విస్మరించలేని నాయకుడిగా ఎదిగారు. ఆ దిశగా తనను తాను మలుచుకున్నారు. అత్యంత కింది స్థాయి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఈ లీడర్ ఇప్పుడు జన నాయకుడిగా, ప్రజలు మెచ్చిన సేవకుడిగా మారి పోయారు. చాలా మంది పొలిటికల్ లీడర్లు ఒక్కసారి పదవి వస్తే, దక్కితే చాలు ఇక తమ కోసం పని చేసిన వారిని, తమను నమ్ముకున్న వారిని పట్టించుకోరు. కానీ ఈ డాక్టర్ సాబ్ అలా కాదు. తన ఎదుగుదల కోసం, మొదటి నుంచి తన కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి జీవితాన్ని ప్రసాదించిన ఘనత లక్ష్మారెడ్డి కే దక్కుతుంది. పుట్టుకతో రెడ్డి సామాజిక వర్గానికి చెందినప్పటికీ ఆయన అన్ని వర్గాల వారిని ఆదరిస్తారు. చేతనైనంత మేరకు సహాయ చేస్తారు. ఎవ్వరికైనా ఆపద వస్తే చాలు వెంటనే స్పందిస్తారు. అంతే కాదు ఏకంగా తనకు జన్మను ప్రసాదించిన, తన ఉన్నతికి కారకులైన వారిని నిత్యం కొలుస్తూనే ఉంటారు. తన తండ్రి నారాయణ రెడ్డి స్మారకార్థం సి.నారాయణరెడ్డి ఫౌండేషన్ ను స్థాపించారు. జడ్చర్ల పట్టణంలో డిబొడ్డున నల్లకుంట చెరువు ప్రాంతంలో ఉన్న దాదాపు 20 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని, పది కాలాల పటు జనం గుర్తుంచుకునేలా తండ్రి నారాయణరెడ్డి స్మృత్యర్థం పార్కు కోసం కేటాయించారు లక్ష్మారెడ్డి. దీనికి సి.నారాయణ రెడ్డి పార్కుగా నామకరణం చేశారు. మినీ ట్యాంక్ బండ్ కింద పనుల నిమిత్తం 2 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ప్రస్తుతం పనులు పురోగతిలో నడుస్తున్నాయి. అంతే కాదు ఎక్కడి వారైనా, కష్టంలో ఉన్నామంటే చాలు చేతనైనంత సహాయం చేయడంలో లక్ష్మారెడ్డి ముందుంటారు. ఆయన స్వస్థలం తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామం. కర్ణాటకలో బిహెచ్ఎమ్మెస్ డాక్టర్ కోర్సు చదివారు. కొంత కాలం వ్యాపారం చేశారు. గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు. సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికయ్యారు. గ్రామంలో దళితుల కోసం ఒక్కో కుటుంబానికి వ్యవసాయం చేసుకునేందుకు గాను ఆయన తన స్వంత భూమి 20 ఎకరాలను ఉచితంగా అందజేశారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా పని చేశారు. ఇదే సమయంలో పలు పదవులు చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అగ్ర భాగాన నిలిచారు. తెలంగాణ ఉద్యమ రథసారధి కేసీఆర్ వెంట నడిచారు. జిల్లాలో ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలిచారు. పార్టీ జిల్లా బాధ్యతలు చేపట్టారు. మలిదశ ఉద్యమానికి ఊపిరి పోశారు. పాలమూరు ఎంపీగా కేసీఆర్ విజయం సాధించడంలో కష్టపడ్డారు. ఇదే సమయంలో తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి కలిసి 2009 లో పోటీ చేశాయి. జడ్చర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని వత్తిడి వచ్చినా ఒప్పందంలో భాగంగా ఆయన హైకమాండ్ డిసిషన్ కు కట్టుబడి, తన సీటును వదులుకున్నారు. ఉమ్మడి స్టేట్ లోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమం కోసం శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన మొట్టమొదటి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాత్రమే. పెద్దాయన కేసీఆర్ నమ్మే నాయకుల్లో, ఆత్మీయుల్లో లక్ష్మారెడ్డి కూడా ఒకరు. అందుకే ఆయనకు టీఆరెఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కేబినెట్ లో కీలక మంత్రి పదవి అప్పగించారు గులాబీ బాస్. మొదటగా విద్యుత్ శాఖా మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా కీలక పోస్టులు అప్పగించారు. ఆయన వందకు వంద శాతం న్యాయం చేశారు. బాస్ దృష్టిలో మంచి పేరు కూడా సంపాదించుకున్నారు. రెండోసారి జరిగిన ఎన్నికల్లో జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో రెండోసారి కూడా కేబినెట్ లో చోటు దక్కుతుందని అంతా భావించారు. కొన్ని సమీకరణాల రీత్యా బిగ్ బాస్ పదవి ఇవ్వలేక పోయారు. కాగా ప్రస్తుత కేబినెట్ లో కొందరు మంత్రుల పనితీరు ఆశించినంత లేక పోవడంతో త్వరలో కొందరికి వేటు తప్పదని సమాచారం. ప్రస్తుతం కేబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉంది. తాజగా కొందరి పదవులు మార్చే పనిలో సీఎం ఉన్నారని, అందులో మొదటగా లక్ష్మన్న తో పాటు పల్లాకు వారి స్థానంలో బెర్తులు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఈ పొలిటికల్ లీడర్ కు పదవి వస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, సామాజిక సేవ కార్యక్రమాలకు ఊతం లభిస్తుందని పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!