నవ్వుల హరివిల్లు..గుండెల్లో చిరుజల్లు
తెలుగు బుల్లి తెరమీద ప్రారంభమైన రియాల్టీ షో బిగ్ బాస్ - 3 ఎపిసోడ్ కు భారీ ఆదరణ లభించింది. ఈ ప్రోగ్రాం వినోద రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదటి ఎపిసోడ్ ను నటుడు ఎన్ఠీఆర్ ప్రయోక్తగా చేస్తే, మరో నటుడు నాని రెండో ఎపిసోడ్ ను సక్సెస్ చేశాడు. ముచ్చటగా మూడో ఎపిసోడ్ ను లవర్ బాయ్ నాగార్జున హోస్ట్ చేశాడు. దీనికి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగు టీఆర్ఫీ రేటింగ్స్ లో టాప్ రియాల్టీ షో గా పేరు తెచ్చుకుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో గుర్తుండి పోయేలా చేసిన పార్టిసిపెంట్ మాత్రం పునర్నవి భూపాళం. చెరగని చిరునవ్వుతో వేలాది మంది మనసు దోచుకుంది ఈ ముద్దు గుమ్మ. పునర్నవి నటిగా కూడా రాణిస్తోంది.
ఉయ్యాల జంపాల చిత్రంలో సునీత పాత్రతో పునర్నవి ప్రేక్షకులను కట్టి పడేసింది. అమాయకత్వం నిండిన టీనేజర్‌గా తన నటనతో యావత్ ప్రేక్షక, చిత్రలోకాన్ని తన వైపునకు తిప్పుకొంది. బిగ్‌బాస్–3 కంటెస్టెంట్‌గా బుల్లి తెరపై తన పాపులారిటీని మరింత పెంచుకుంది. అమాయకమైన నవ్వు, ముద్దు ముద్దుగా మాటలు నాగార్జునను సైతం ఆకట్టుకునేలా చేసింది. హీరోయిన్ గానూ పలు అవకాశాలను అంది పుచ్చుకుంది. పునర్నవి భూపాలం తలిదండ్రులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. జర్నలిజం చదువుకుంది. ఇదే సమయంలో ఓ జ్యూయలరీ యాడ్‌లో నటించింది. సినిమా అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.
నగేష్‌కుమార్ ఇంట్లో రచయిత గుత్తి మధుసూదనరెడ్డి, దర్శకుడు విరించి వర్మలు ‘ఉయ్యాల జంపాల’ సినిమా తీసేందుకు గాను కథా చర్చలు జరిపారు. అ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రకు పునర్నవిని ఒప్పించారు. రాజ్‌తరుణ్, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్టయింది. తర్వాత శర్వానంద్, నిత్యమీనన్‌ల మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో శర్వానంద్ కుమార్తెగా నటించిన పునర్నవికి మంచి మార్కులే పడ్డాయి. చదువుకొంటున్న సమయంలో హీరోయిన్‌గా ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. ‘పిట్టగోడ’ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు. మహేశ్వరి క్రియేషన్స్ ‘ఎందుకో ఏమో’లోనూ నాయికగా నటించారు.
ఆట్ల అర్జున్‌రెడ్డి దర్శకత్వంలో తీసిన ‘సైకిల్’ సినిమా ఈ నెలలో విడుదల కానుంది. బిగ్ బాస్–2లో కంటెస్టెంట్‌గా అహ్వానం వచ్చినా, అప్పట్లో అమెరికాలోని తన సోదరి దగ్గర ఉండటంతో వీలు పడలేదు. ఈ సీజనులో బిగ్ బాస్–3లో పాల్గొన్న పునర్నవికి మంచి గుర్తింపు లభించింది. రంగ స్థలంపై ఆసక్తితో నాటకాల్లో కూడా అప్పుడప్పుడు నటిస్తోంది. గిరీష్ కర్నాడ్ రచించిన ‘నాగమండల’ హిందీ నాటకంలో లీడ్ క్యారెక్టర్ రాణి పాత్రలో పునర్నవి నటనకు ప్రశంసలు లభించాయి. తనికెళ్ల భరణి రాసిన మరో నాటిక లోనూ నటించి మెప్పించింది పునర్నవి భూపాళం. మొత్తం మీద ఈ నెలవంక జనాన్ని, యూత్ ను నవ్వులతో కట్టి పడేస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి