అద్భుతం..సైకత శిల్పం..కళా నైపుణ్యం


అద్భుత కళా నైపుణ్యం కలిగిన కళాకారుడిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ సైకత శిల్పి  సుదర్శన్ పట్నాయక్‌ కు అరుదైన పురస్కారం లభించింది. 2019 వ సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ఇటాలియన్ గోల్డెన్ శాండ్ ఆర్ట్ అవార్డ్ కు ఎంపికయ్యారు. ఇటలీలో జరిగే అంతర్జాతీయ స్కోరానా శాండ్ నేటివిటీ వేడుకల్లో ఆయనకు ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు పట్నాయక్‌కు ఇప్పటికే ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి భారత్‌ తరపున కూడా పట్నాయక్ నేతృత్వం వహిస్తున్నారు. కాగా సుదర్శన్ పట్నాయక్ సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయనను 2014లో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో గౌరవించింది.

15 ఏప్రిల్ 1977 లో పుట్టాడు. ప్రస్తుతం సుదర్శన్ పట్నాయక్ కు 42 ఏళ్ళు. స్వస్థలం ఒడిస్సా రాష్ట్రం పూరీ. వృత్తి రీత్యా సైకత శిల్పిగా ఉన్నారు. గత 27 ఏళ్లుగా ఇదే వృత్తిలో కొనసాగుతూ వస్తున్నారు. ఎందరో శిల్పుల కన్నా భిన్నంగా సముద్రపు ఒడ్డును, ఇసుకను తన కళాత్మక ప్రతిభతో శిల్పాలుగా మార్చడం సుదర్శన్ పట్నాయక్ కు వెన్నతో పెట్టిన విద్య. ప్రపంచ స్థాయి సైకత శిల్పాల ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహించిన ఘనత ఆయనకే దక్కింది. ఒక ప్రక్క దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చి పెట్టడంతో పాటు, సైకత శిల్పాల నిర్మాణంలో తనదైన ప్రత్యేక ముద్ర కనబరిచారు. తన సృజనాత్మకతను ఉపయోగించి స్వయంగా నేర్చుకున్నాడు.

తన 7 సంవత్సరాల వయస్సు నుంచే సైకత శిల్పాలను చేయడం ప్రారంభించాడు. కొన్ని వందల సైకత శిల్పాలను సృష్టించాడు. అతి పొడవైన శాంతాకాస్ ను ఇసుకతో చేసి ప్రపంచ రికార్డును సాధించాడు. రష్యాలో జరిగిన మొదటి మాస్కో అంతర్జాతీయ సైకత శిల్ప పోటీలో పాల్గొని "పీపుల్స్ చాయిస్" బహుమతిని పొందారు. నేషనల్ అల్యూ మినియం కంపెనీకి భారత దేశ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. సైకత శిల్పాలను సృజనాత్మకంగానే కాకుండా, ఒక సందేశాన్ని ప్రజలకు అందించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు సుదర్శన్ పట్నాయక్. అనేక ప్రాంతాలలో  పర్యటించి సైకత శిల్పాలపై వర్క్ షాప్ నిర్వహించాడు. ది గోల్డెన్ సాండ్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్ ను భారత దేశంలో మొదటిసారి నెల కొల్పాడు.

పట్నాయక్ ప్రపంచ వ్యాప్తంగా 50 కి పైగా అంతర్జాతీయ సైకత శిల్ప చాంపియన్ షిప్ లలో పాల్గొన్నారు. అనేక అవార్డులు పొందాడు. భారత్‌ తరుపున అంతర్జాతీయ స్థాయి పోటీల్లో 40 సార్లు పాల్గొన్నారు. పది హేను ప్రథమ బహుమతులను గెలుచుకున్నారు. ఎనిమిదవ అంతర్జాతీయ బెర్లింగ్‌ శాండ్‌ స్కల్‌ప్చర్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో ‘ఫిఫ్త్‌ కాన్సిక్యూటివ్‌ విన్నర్‌’ అవార్డును పొందారు. అప్పటి రాష్టప్రతి ప్రతిభా పాటిల్‌ చేతుల మీదగా పురస్కార లేఖను అందుకున్నారు. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు 2009లో ప్రకటించిన ఈ ఏటి మేటి వ్యక్తులలో అమితాబ్‌ బచ్చన్‌, సచిన్‌ టెండూల్కర్‌, లతా మంగేష్కర్‌ వంటి ప్రముఖుల పేర్ల సరసన పట్నాయక్‌ పేరు కూడా చేరింది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!