సారూ..తగ్గితే తప్పేంటి..?
తెలంగాణాలో రెండవ సారి కొలువు తీరిన సీఎం కేసీఆర్ తన మాట తప్పా ఎవ్వరి మాటా వినడం లేదు. వినిపించు కోవడం లేదు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు కు ఘనమైన చరిత్ర ఉన్నది. ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా, ఉద్యమ నాయకుడిగా, పాలకుడిగా, పరిపాలనా దక్షుడిగా కేసీఆర్ పేరు తెచ్చుకున్నారు. మేధావిగా, అపర చాణ్యుక్యుడిగా వినుతి కెక్కారు. బహు భాషా కోవిదుడిగా పేరొందారు. తాను ఏది చెబితే అదే చట్టమని, అదే శాసనమని నమ్ముతున్నారు. ఆ దిశగా పాలన సాగిస్తున్నారు. తాను తప్పా ఇంకెవ్వరూ మాట్లాడ కూడదని షరతు విధించారు. దీంతో తెలంగాణాలో ఇప్పుడు మాట్లాడటం అన్నది నేరంగా మారింది.
ప్రజలపై నిర్బంధం కొనసాగుతున్నది. నిఘా మరింతగా పెరిగింది. గత 60 ఏళ్ళ కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో లేని విధంగా పాలన సాగుతోంది. ఎమ్మెల్యేలు గెలిచినా వాళ్ళు పైకి మాట్లాడలేని పరిస్థితి నెలకొన్నది. ఉద్యమ సమయంలో అన్ని వర్గాలను కేసీఆర్ కదిలించారు. అందరినీ ఒకే తాటి పైకి తీసుకు వచ్చారు. అదే క్రమంలో ఆర్టీసీకి చెందిన కార్మికులు పెద్ద ఎత్తున ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగమయ్యారు. కీలక పాత్ర పోషించారు. సారుకు అండగా నిలబడ్డారు. ప్రజా రవాణా పూర్తిగా స్తంభించి పోయింది. ఇదే సమయంలో కొత్త రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు బాగు పడతాయని ఆశించారు అందరూ.
కానీ కొలువు తీరాక, సీఎం కుర్చీ మీద ఎక్కాక అన్నీ మరిచి పోయారు. పోలీసులకు అంతులేని పవర్స్ ఇచ్చారు. రాష్ట్రాన్ని సిసి కెమేరాలతో నింపేశారు. అంత కంటే ఎక్కువగా విద్య, వైద్యం, ఉపాధి ఎండ మావిగా మరి పోయింది. అవినీతి ఆక్టోపస్ లా విస్తరించింది. నియంత్రించే వ్యవస్థ గాడి తప్పింది. ఇదే సమయంలో తాము అండగా ఉంటాడని సంబరపడి, పాలాభిషేకం చేసిన ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ చుక్కలు చూపించాడు. వారిని డోంట్ కేర్ అంటున్నారు. హైకోర్టు చెప్పినా పట్టించు కోవడం లేదు. అంతేనా ఓ అడుగు ముందుకేసి 49 వేల మంది సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ ప్రకటించారు. దీంతో కార్మికులు సమ్మె బాట పట్టారు.
ఆర్టీసీని విలీనం చేయలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే 16 మంది కార్మికులు అసువులు బాశారు. అయినా కేసీఆర్ చెక్కు చెదరడం లేదు. విపక్షాలు మాత్రం తగ్గితే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి కైనా మించి పోయింది ఏమీ లేదు. రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్న పెద్దాయన తమ పట్ల ఇంత కక్ష పూరితంగా వ్యహరించడం భావ్యం కాదని కార్మికులు వాపోతున్నారు. పాలకుడిగా సక్సెస్ అయిన సీఎం కార్మికుల విషయంలో కొంత బెట్టు దిగితే బావుంటుందని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి