మారిన స్వరం..కాషాయ జపం


రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..శాశ్వత మిత్రులు ఉండరన్న వాస్తవం కన్నడ నాట వాస్తవ రూపం దాల్చేలా కనిపిస్తోంది. నిన్నటి దాకా అధికారం లో ఉన్న జేడీఎస్ అధినేత కుమార స్వామి ఉన్నట్టుండి స్వరం మార్చడం సంచలనం రేపింది. నిన్నటి దాకా జాతీయ కాంగ్రెస్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఇదే సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సోనియా, రాహుల్ గాంధీతో పాటు చంద్రబాబు తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు కూడా. విశ్వాస పరీక్షలో కుమార తన సీఎం పదవిని పోగొట్టుకున్నారు.

తాజాగా కుమార స్వామి కాషాయానికి అనుకూలంగా కొత్త పల్లవి అందుకున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌తో  చెట్టా పట్టా లేసుకుని తిరిగిన ఆయన బీజేపీ పార్టీకి అనుకూలంగా గళం సవరించు కున్నారు. రాష్ట్రంలో యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ కూలి పోయే అవకాశమే లేదని, ఒక వేళ అలాంటి పరిస్థితే వస్తే బీజేపీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని కుమారస్వామి వ్యాఖ్యానించడం చర్చ నీయాంశంగా మారింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీనియర్లు డీకే శివకుమార్, పరమేశ్వర్‌ వంటి వారిపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతుండడం, తన ఎమ్మెల్యేలను కాపాడు కోవడం కోసం కుమారస్వామి ఈ ఎత్తుగడను వేస్తున్నట్లు చర్చ సాగుతోంది.

జేడీఎస్‌లోని 10  నుంచి 12 మంది ఎమ్మెల్యేలు కొన్ని రోజులుగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ, అధికార పార్టీ తీర్థం పుచ్చుకునే ఆలోచనలు చేస్తున్నారు. ఈ తరుణంలో తన ఎమ్మెల్యేలను కాపాడు కునేందుకు పావులు కదిపారు. బీజేపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటిస్తే తమ ఎమ్మెల్యేలు ఫిరాయించ కుండా ఆగిపోతారనే ఉద్ధేశంతోనే ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మెజారిటీ లేని ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న యడ్డి డిసెంబరులో జరిగే ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి తీరాల్సిందే.

ఇలాంటి సమయంలో బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కుమార స్వామి బహిరంగంగా ప్రకటించడం యడియూరప్పకు ప్రయోజనం కలిగించే అంశమే. బీజేపీని ఎలాగైనా గద్దె దింపాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ నేతలను కుమార స్వామి యూ టర్న్‌ నీరు గార్చేలా చేసింది. మొత్తం మీద అధికారం అంటే ఇదేనేమో కదూ అని ఇతర నేతలు లోలోపట మాట్లాడు కుంటున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!