కార్మికుల సమరం..అంతిమ విజయం

బాధలు తట్టుకుని..బంధనాలు తెంచుకుని..నిఘాను దాటుకుని ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సకల జనుల సమర భేరి సక్సెస్ అయ్యింది. వేలాది మంది కార్మికులు హైదరాబాద్ కు తరలి వచ్చారు. వీరికి మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలతో పాటు కవులు, కళాకారులు, మేధావులు, సబ్బండ వర్గాలు తరలి వచ్చారు. ఈ సభ మరో పోరాటాన్ని తలపింప చేసింది. ఈ సందర్బంగా ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సకల జన భేరి మోగింది. ప్రభుత్వ విధానాలను సభా వేదికగా నేతలు ఎండ గట్టారు.

ఆర్టీసీని అంత మొందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు పూస గుచ్చినట్లు వివరించారు. ఆర్టీసీ నష్టాలపై ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పి కొట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం ఆర్టీసీ కార్మికులదే అని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మెతో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా గమ్యాన్ని చేరాల్సిందే నని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆనాడు  తెలంగాణ కోసం కుల మతాలకు అతీతంగా ఉద్యమం చేశారని గుర్తు చేశారు. తమను సీఎం కేసీఆర్ బెదిరించారని, భయపెట్టారని అయినా సరే బెదిరేది లేదని అశ్వత్థామ రెడ్డి స్పష్టం చేశారు.

జీతాలు ఇవ్వకున్నా ఏ ఒక్క కార్మికుడూ వెనక్కి తగ్గలేదని చెప్పారు. హైకోర్టు ఆదేశాలను కూడా ప్రభుత్వం పాటించడం లేదని నిప్పులు చెరిగారు. సమ్మె చట్ట వ్యతిరేకం కాదని హైకోర్టు చీఫ్ జస్టిసే చెప్పారని గుర్తు చేశారు. ఆర్టీసీ సమ్మెకు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ తప్ప అన్ని వర్గాలు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అండగా ఉన్నాయని చెప్పారు.  సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని తేల్చి అన్నారు. అన్ని డిపోల ఎదుట 24 గంటల దీక్షలు చేపడతామని అశ్వత్థామరెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!