సమ్మెపై స్పందించిన పెద్దన్న..ఏపీలో ఆర్టీసీ జేఏసీకి మద్దతు

తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ కు , పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న పెద్దన్న కేశవరావు ఆర్టీసీ సమ్మెపై లేటుగా అయినా లేటెస్ట్ గా స్పందించారు. అయితే ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ ను అభినందిస్తున్నట్లు చెబుతూనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ముఖ్యమంత్రి సానుభూతితో పరిశీలించాలని హితవు పలికారు. కార్మికుల ఆత్మహత్యలు తనను ఎంతగానో వేదనకు గురి చేశాయని, చావులు, బలిదానాలు, ఆత్మహత్యలు ఏ సమస్యలను పరిష్కరించ లేవని అన్నారు. కేశవరావు ప్రస్తుతం అధికార పార్టీ పార్లమెంటరీ నేతగా ఉన్నారు. పరిస్థితులు చేయిదాటి పోక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు కార్మికులను సమ్మె విరమింప చేయాలని, ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గతంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పరిష్కరించిందన్నారు.

44 శాతం ఫిట్‌మెంట్, 16 శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఆర్టీసీతో పాటు ఏ ప్రభుత్వరంగ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన లేదని కేశవరావు స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడమంటే తమ విధానాన్ని మార్చుకోవాలని కోరడమేనని పేర్కొన్నారు. ఇది ఆర్టీసీ యూనియన్లకు సంబంధం లేని విషయమని వ్యాఖ్యానించారు. అదే విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం తప్ప కార్మికులు లేవనెత్తిన మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కేశవరావు విఙ్ఞప్తి చేశారు. ఇక అద్దె బస్సులు, ప్రైవేట్ స్టేజీ క్యారేజీల విషయంలో కేసీఆర్‌ చేసిన ప్రకటనను ప్రస్తుత సమ్మె నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా మాత్రమే చూడాలని విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేశవరావు ఓ ప్రకటన విడుదల చేశారు.

కాగా తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందంటూ ఆవేదన చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో కండక్టర్ ప్రాణం కోల్పోయాడు. వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరో వైపు విపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో తెలంగాణాలో ఆర్టీసీ చేస్తున్న ఆందోళనకు, సమ్మెకు ఏపీలో మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి అండగా నిలుద్దామని ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక పిలుపు నిచ్చింది. 19న తెలంగాణ బంద్‌ సందర్భంగా ఎర్ర బ్యాడ్జీలతో ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరై మద్దతు తెలపాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. వెంటనే తెలంగాణ జేఏసీ నాయకత్వంతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం కేసీఆర్ చేయాలని ఏపీ ఆర్టీసీ నేతలు కోరడం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!