లోకాన్ని వీడిన గొల్లపూడి

తెలుగు నాట విషాదం చోటు చేసుకుంది. రచయితగా, నటుడిగా అలరిస్తూ వచ్చిన గొల్లపూడి మారుతీరావు  ఇక సెలవంటూ వెళ్లి పోయారు. అనారోగ్య కారణాలతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.  సాహిత్యాభిలాషిగా, రచయితగా అన్ని రంగాలకు చెందిన అంశాలపై విశ్లేషకునిగా, విప్లవాత్మకమైన విమర్శకునిగా గొల్లపూడి పేరు తెచ్చుకున్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. చెన్నైలో తెలుగు సంఘాల కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న గొల్లపూడి.. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అనంతరం కోలుకుని ఇంటికి చేరారు. అయితే, మళ్లీ అస్వస్థతకు గురై ఇటీవల ఆస్పత్రిలో చేరారు. వృద్ధాప్య కారణాల వల్ల శరీరం చికిత్సకు సహకరించ కపోవడంతో తుది శ్వాస విడిచారు.

గొల్లపూడి మారుతీరావు 1939 ఏప్రిల్‌ 14న విజయ నగరంలో జన్మించారు. విద్యాభ్యాసాన్ని విశాఖపట్నంలోనే పూర్తి చేశారు. చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఉంటూనే నెలలో కొన్ని రోజులు విశాఖలో గడుపుతూ సాహితీ ప్రియులకు అందుబాటులో ఉండేవారు. ఎన్నో అంశాలపై వ్యాసాలు రాశారు. ఆయన మాటల్లో ఓ విరుపు ఉండేది. అది ఆయనను ప్రత్యేకమైన వ్యక్తిగా, నటుడిగా గుర్తుంచుకునేలా చేసింది. గొల్లపూడి మరణం తెలుగు సినిమా రంగానికి, సాహిత్యానికి తీరని లోటు గా అభివర్ణించారు ప్రముఖులు. ఆయన జీవించినంత కాలం చదివేందుకు, రాసేందుకు ప్రయత్నం చేశారు.

సినిమా అవకాశాలు రాక పోయినా బాధ పడలేదు. కానీ రాయడాన్ని మానుకోలేదు. విలక్షణ రచయిత, విమర్శకుడు, జాతీయ భావాలు కలిగిన మానవతావాది, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు ఇక లేరనే వార్త తీవ్రమైన బాధ కలిగించిందని వెంకయ్య అన్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు తెలుగు భాషాభివృద్ధికి దిశా నిర్దేశం చేశాయని కేసీఆర్‌ కొనియాడారు. మొత్తం మీద గొల్లపూడి లేక పోవడం మనందరికీ బాధాకరం. ఇలాంటి వాళ్ళు కొద్దీ మందే ఉంటారు. అలా వస్తూ ఇలా వెళ్లి పోతారంతే. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!