అస్సాంలో ఆగ్రహజ్వాల

పార్లమెంట్‌ సాక్షిగా ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. గువాహటిలో యుద్ధ వాతావరణం కనిపించింది. కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా రోడ్ల దిగ్బంధం, గృహ దహనాలు, దుకాణాల లూటీకి పాల్పడుతుండటంతో పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు చెబుతుండగా ముగ్గురు మరణించారని ఆందోళనకారులు అంటున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యా, వాణిజ్య సంస్థలు పని చేయలేదు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ముందు జాగ్రత్తగా త్రిపుర, అసోంలకు రైలు సర్వీసులను రద్దు చేశారు. విమాన సర్వీసులను సైతం పలు ప్రాంతాలకు నిలిపి వేశారు.

సైనికులు ఫ్లాగ్‌ మార్చ్‌ చేపట్టారు. ఇంటర్నెట్‌ సేవలపై మరో 48 గంటల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అస్సాం వాసులకు ప్రధాని మోదీ ట్విట్టర్‌ ద్వారా పలు హామీలిచ్చారు. ఇంటర్నెట్‌పై నిషేధం ఉండగా ట్విట్టర్‌లో హామీల విషయం ప్రజలకెలా తెలుస్తుందని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. ఇదిలా ఉండగా రాష్ట్ర రాజధాని గువాహటిలోనే ఆందోళనల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆందోళనకారులు భవనాలు, దుకాణాలకు నిప్పు పెట్టడం, ధ్వంసం చేయడం, రోడ్లపై టైర్లు కాల్చడం, అడ్డంకులు కల్పించడం, పోలీసులతో ఘర్షణలకు దిగారు. దీంతో పలుచోట్ల పోలీసులు కాల్పులు జరిపారు. గువాహటిలో పర్యటిస్తున్న అస్సాం పోలీస్‌ చీఫ్‌ భాస్కర్‌ జ్యోతి మహంత కాన్వాయ్‌పై కొందరు రాళ్లు విసిరారు.

ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఎవరికీ ఎటువంటి అపాయం సంభవించ లేదు. పోలీసు ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు గువాహటిలోని లతాశిల్‌ మైదానంలో సినీ, సంగీత పరిశ్రమకు చెందిన ప్రముఖులు సహా వందలాదిగా ప్రజలు, విద్యార్థులు హాజరయ్యారు. ఆందోళనకారులు దిగ్బంధించడంతో వేలాది మంది ప్రయాణికులు గువాహటి విమానాశ్రయంలో చిక్కుకు పోయారు. రహదారుల దిగ్బంధం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పౌరవిమానయాన శాఖ తెలిపింది. డిబ్రూగఢ్‌లో ముఖ్యమంత్రి సోనోవాల్, ఎమ్మెల్యే బినోద్‌ హజారికా నివాసాలకు, వాహనా లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. 

కామ్‌రూప్‌ జిల్లాలో దుకాణాలు, విద్యా సంస్థలు, కార్యాలయాలు మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. 31వ నంబర్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు. అస్సాంలో శాంతిభద్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసుకుంటున్నట్లు ఇండిగో, విస్తారా, ఎయిరిండియా, స్పైస్‌జెట్‌ ప్రకటించగా గో ఎయిర్, ఎయిర్‌ ఏషియా ఇండియా షెడ్యూల్‌ను మార్చుతున్నట్లు తెలిపాయి. ప్రభుత్వ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. జాతీయతను, దేశ సమగ్రతను దెబ్బతీసేవి, హింసను ప్రేరేపించే అంశాలను ప్రసారం చేయవద్దని శాటిలైట్‌ టీవీ చానెళ్లను కేంద్రం కోరింది. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!