మరాఠా పీఠంపై శివసేనాని


దేశం నివ్వెర పోయేలా మహారాష్ట్ర పీఠాన్ని అధీష్టించారు శివసేన సేనాధిపతి ఉద్దవ్ థాక్రే. కాకలు తీరిన నాయకులు, పాలకులుగా వినుతికెక్కిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు కోలుకోలేని షాక్ ఇచ్చారు శివసేనాని. మహా ..రాష్ట్రలో నూతన శకం ప్రారంభమైంది. శివ సైనికుడిని మరాఠా సీఎం పీఠంపై కూర్చో బెడతామంటూ ఠాక్రే చేసిన శపథం ఎట్టకేలకు నెర వేరింది. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా జనసందోహం మధ్యన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని శివాజీ మైదానంలో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. దీంతో ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా ఉద్ధవ్‌ చరిత్ర సృష్టించారు.

ఉద్ధవ్‌తో పాటు మరో ఆరుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మూడు పార్టీల నుంచి ఇద్దరు చొప్పున.. శివసేన నుంచి ఏక్‌నాథ్‌ ముండే, సుభాష్‌ దేశాయ్‌, ఎన్సీపీ నుంచి చగన్‌ భుజ్జల్‌, జయంత్‌ పాటిల్‌, కాంగ్రెస్‌ నుంచి బాలాసాహెబ్‌, నితిన్‌​ కేత్‌లు ప్రమాణం చేశారు. దీంతో నెల రోజుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మహారాష్ట్రకు ఇక 18వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ సేవలు అందించనున్నారు. గత నెల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ, శివసేన మధ్య పదవుల పంపకాలపై విభేదాలు రావడంతో వారి కూటమి విచ్ఛిన్నమైంది.

ఈ నేపథ్యంలో అనేక మలుపులు తిరిగిన మహా రాజకీయాలు చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో సద్దు మణిగింది. సరిపడ బలం లేని కారణంగా బల పరీక్షకు ముందే ఫడ్నవిస్‌ రాజీనామా చేశారు. అనంతరం రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ మద్దతుతో మహా వికాస్‌ అఘాడి పేరుతో కూటమిగా ఏర్పడ్డాయి. ఉద్ధవ్‌ ఠాక్రేను కూటమి నేతగా ఎన్నుకున్నాయి. ఉద్ధవ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో పాటు సుప్రియా సూలే, రాజ్‌ఠాక్రే, సుశిల్‌ కుమార్‌ షిండే, ఎంకే స్టాలిన్‌లు పాల్గొన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!