సోని ప్లాన్ అమలయ్యేనా
ఇండియన్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ లో రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ కు చెందిన ముకేశ్ అంబానీకి చెందిన నెట్‌వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్‌లో కొంత వాటాను జపాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కార్పొరేషన్ కొనుగోలు చేసే అవకాశాలు వున్నాయి. దీనికి సంబంధించి నెట్‌వర్క్18 మీడియాలో సోనీ కంపెనీ మదింపు నిర్వహిస్తోందని సమాచారం. చర్చలు ఆరంభ దశలోనే ఉన్నాయని, ఒప్పందం కుదరవచ్చు లేదా కుదరక పోవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నెట్‌వర్క్18లో వాటా కైవసం కోసం ఏ రకమైన ఒప్పందాలు కుదుర్చు కోవాలి అనే అంశంపై సోనీ కంపెనీ కసరత్తు చేస్తోంది. వాటా కోసం బిడ్‌ను దాఖలు చేయడం లేదా తన భారత వ్యాపారాన్ని నెట్‌వర్క్18 వినోద చానెళ్లలో విలీనం చేయడం, తదితర మార్గాలపై సోనీ అధ్యయనం చేస్తోంది.
ఒక వేళ ఒప్పందం సాకారమైతే, సోనీకి ‘స్థానిక’ బలం మరింత పెరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్ తదితర పోటీ సంస్థలకు గట్టి పోటీని ఇవ్వ గలుగుతుంది. మరోవైపు అంబానీ చానెళ్లకు సోనీ ఇంటర్నేషనల్ కంటెంట్‌కు యాక్సెస్ లభిస్తుంది. కాగా వివిధ అవకాశాలను మదింపు చేస్తున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి పేర్కొన్నారు. సోనీ సంస్థ భారత, జపాన్ విభాగాలు ఎలాంటి స్పందనను వ్యక్తం చేయలేదు. భారత ఓటీటీ మార్కెట్లో అపార అవకాశాలున్నాయి. ఏ అంతర్జాతీయ సంస్థయినా, ఇక్కడి అవకాశాలు అంది పుచ్చు కోవాలంటే స్థానిక వ్యూహం తప్పనిసరని నిపుణులంటున్నారు.
రానున్న రెండేళ్లలో ఇలాంటి భాగస్వామ్యాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు మరిన్ని చోటు చేసుకుంటాయని వారంటున్నారు. సోనీ కంపెనీ భారత్‌తో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా ద్వారా వివిధ చానెళ్లను నిర్వహిస్తోంది. ఇక టీవీ18 బ్రాడ్‌కాస్ట్ సంస్థ మొత్తం 56 చానెళ్లను నిర్వహిస్తోంది. ఈ వార్తలతో బీఎస్‌ఈలో ఇంట్రాడేలో నెట్‌వర్క్18 మీడియా షేర్ 19%, టీవీ18 బ్రాడ్‌కాస్ట్ షేర్ 10% మేర పెరిగాయి. చివరకు నెట్‌వర్క్18 షేర్ 8% లాభంతో రూ.27.70 వద్ద, టీవీ18 బ్రాడ్‌కాస్ట్ 1.5% లాభంతో రూ. 23 వద్ద ముగిశాయి. మొత్తం మీద సోనీ ఒప్పందం చేసుకోగలిగితే చాలా మంది మీడియా ప్రొఫెషనల్స్ కు కొలువులు దక్కే అవకాశం ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి