బంధాలే కీలకం..కథకు ప్రాణం
దేనికైనా కుటుంబమే ముఖ్యం. కథైనా లేదా పాటలైనా, మాటలైనా అన్నీ ఇందులోంచి వచ్చినవే. అందుకే బంధాల అనుబంధాలను, వాటిలోని భావోద్వేగాలను తెరమీద చూపించేందుకు తాను ప్రయత్నం చేస్తున్నారు వర్ధమాన దర్శకుడు సుందర్ సూర్య. ఆప్యాయతలు.. అనుబంధాలంటే ఆయనకు చాలా ఇష్టం. పెరిగిన వాతావరణం అలాంటిది. అమ్మ ప్రోత్సాహంతోనే సినిమా రంగంలో రాణిస్తున్నా అంటున్నారు. 12 ఏళ్ల ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా. ఆనంద క్షణాల్ని గుర్తు చేసుకుంటూ, ప్రస్తుత కాలాన్ని గడపాలనే చిన్న లైన్ ఆధారంగానే అమ్మమ్మగారి ఇల్లు సినిమా తీశా అంటున్నారు సూర్య. కథా చర్చల కోసం ఆయన హైదరాబాద్ కు వచ్చారు.
చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి. అందుకే దీనినే ఎంచుకున్నారు. కుటుంబంలో పెద్దన్నయ్య ప్రభుత్వ ఉద్యోగి, చిన్నన్నయ్య వ్యాపారి. నచ్చిన రంగంలో రాణించాలని అమ్మ మణి ప్రోత్సహించింది. ఆమెకు చాలా రుణపడి ఉన్నా. మనసుకు నచ్చిన పని చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదు. దీనిని నేను బలంగా విశ్వసిస్తాను. అందుకే చిత్ర పరిశ్రమలో నిలదొక్కు కోవాలనే బలమైన కాంక్షతో ముందుకు సాగుతున్నా అని చెప్పారు ఈ యంగ్ డైరెక్టర్. అమ్మమ్మ గారి ఇల్లు చిత్రీకరణ నా బలమైన ఆకాంక్షను సాకారం చేసింది. ఆనంద క్షణాల్ని గుర్తు చేసుకుంటూ ప్రస్తుత కాలాన్ని గడపాలనే చిన్న లైన్‌ను ఆధారంగా చేసుకుని కథను సిద్ధం చేశానన్నారు. పిఠాపురంలో శివదుర్గా థియేటర్ మా మావయ్యది. చిన్నతనం నుంచి అక్కడ సినిమాలు చూడటం అలవాటైంది.
డిగ్రీ చదివే రోజుల్లో విశాఖకు సినిమా చూసేందుకు వచ్చే వాడ్ని. ఉదయం కాకినాడ ప్యాసింజర్‌లో నగరానికి వచ్చి.. మధ్యాహ్నం భోజనం చేసి చిత్రాలయ థియేటర్‌లో సినిమా చూసి సాయంత్రం అదే పాసింజర్‌లో తిరిగి కాకినాడ వెళ్లేవాడ్ని. ఈ ఒక్క మాట చాలు నాకు సినిమా లంటే ఎంత ఆసక్తో చెప్పేందుకు అన్నారు. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్, రొమాంటిక్, కామెడి కథల్ని సిద్ధం చేసుకుంటున్నాను. త్వరలో యూత్ యాక్షన్ ప్రధానంగా సాగే కథను సిద్ధం చేస్తున్నా. నా కథల్లో భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తా. ప్రతీ మనిషిని కట్టి పడేసేది అనుబంధాలే. వీటికే అధిక ప్రాధాన్యం ఉంటోంది. చిత్ర పరిశ్రమలో 12 ఏళ్లుగా పని చేస్తున్నారు.
జి.నాగేశ్వరరెడ్డి, ఎన్.శంకర్, బొమ్మరిల్లు భాస్కర్‌ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. టీవీ సీరియల్స్, పలు ప్రకటనలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అనంతరం పూర్తి స్థాయిలో దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. అమ్మమ్మగారి ఇల్లు తొలి ప్రయత్నం. కుటుంబ సంబంధాల నేపథ్యంలో తీశారు సూర్య. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచనా శైలి చాలా ఇష్టం. చెప్పాలనుకున్న కథని ఆయన కేవలం తన పాటలో రెండు చరణాలతో చెప్పేస్తారు. అందుకే తొలి చిత్రానికి ఆయనతో పట్టుబట్టి, ఒప్పించి పాట రాయించు కున్నారు. చిత్ర పరిశ్రమకు అనుకూలమైన పరిస్థితులు విశాఖలో ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ చిత్రీకరణ చేసుకున్న ప్రతీ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం చిత్ర పరిశ్రమలో ఉందంటూ తన మనసులోని మాటల్ని బయట పెట్టారు ఈ దర్శకుడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి