అజ్జూకు అరుదైన గౌరవం


భారత మాజీ క్రికెట్ సారధి, ప్రస్తుత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షడు మహమ్మద్ అజహరుద్దీన్ కు అరుదైన గౌరవం దక్కనుంది. ఇప్పటికే ఈ అతగాడికి ఎన్నో అవార్డులు, పురస్కారాలు దక్కాయి. ఇండియా జట్టుకు ఎనలేని విజయాలు నమోదు చేసిన ఆటగాడిగా పేరుంది. ప్రస్తుతం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో  అజహరుద్దీన్‌ పేరిట ఒక స్టాండ్‌ ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌సీఏ అపెక్స్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నార్తర్న్‌ పెవిలియన్‌లోని స్టాండ్స్‌లలో ఒక దానిని అజహర్‌ స్టాండ్‌గా వ్యవహరిస్తారు.

డిసెంబర్‌ 6న భారత్, వెస్టిండీస్‌ మధ్య ఇక్కడ జరిగే తొలి టి20 మ్యాచ్‌ సమయంలో అధికారికంగా స్టాండ్‌కు పేరు పెడతామని హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌ వెల్లడించారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ క్రికెటర్లు అర్షద్‌ అయూబ్, వెంకటపతి రాజులను భవిష్యత్తుల్లో ఇదే తరహాలో గౌరవిస్తామని కూడా ఆయన చెప్పారు. మరో వైపు సౌత్‌ పెవిలియన్‌ బ్లాక్‌లోని ఒక లాంజ్‌కు హెచ్‌సీఏ మాజీ సంయుక్త కార్యదర్శి ఆర్‌.దయానంద్‌ పేరు కూడా పెట్టనున్నారు.

టి20 మ్యాచ్‌ కోసం నేటి నుంచి టికెట్ల అమ్మ కాలు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహర్‌ ప్రకటించారు. క్రికెట్‌ పరిపాలకుడిగా ఇది తనకు తొలి మ్యాచ్‌ అని, దీనిని విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. టికెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకునే వెసలుబాటును క్రికెట్ ఫ్యాన్స్ కు కల్పించినట్లు వెల్లడించారు.  టికెట్ల ధరలను 800, 1000, 1500,  4000,  5000,  7500, 10000, 12500 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తం మీద అజ్జూ భాయికి ఈ రకంగా పేరు పెట్టడాన్ని అభిమానులు స్వాగతిస్తున్నారు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!