ధిక్కార స్వరం..వెంటాడుతున్న వివాదం


 ఈ దేశంలో ప్రశ్నించడం అన్నది నేరంగా మారింది. మతం పేరుతో..కులం పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారు. స్వేచ్ఛగా నాలోని ఆలోచనలను, భావాలను, అభిప్రాయాలను వ్యక్తీకరించేందుకు భారత రాజ్యాంగం నాకు సర్వ హక్కులు కల్పించింది. నిలదీస్తే చంపేస్తారా. నిన్న గౌరీ లంకేశ్ ను చంపారు. రేపు నన్నూ చంపొచ్చు. అంటూ తన ధిక్కార స్వరాన్ని వినిపించిన ఆ ఒకే ఒక్క గొంతు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ది. మిగతా నటీనటులు డబ్బులు ఎలా వెనకేసు కోవాలో అని ప్రయత్నాలు చేస్తుంటే ప్రకాష్ మాత్రం స్వేచ్ఛ, న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. సమాజం కోసం సమస్యలపై నిలదీస్తున్నారు.

ఇవ్వాళ ప్రశ్నించక పోతే రేపు బతకడం మరింత కష్టమవుతుందని ఈ నటుడు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయనను వివాదాలు వెంటాడుతున్నాయి. ఏకంగా ప్రకాష్ రాజ్ ను సినిమా రంగం నుండి బహిష్కరించాలనే దాకా వెళ్ళింది. ఈ మేరకు కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలిలో ఫిర్యాదు నమోదైంది. హిందూ దేవుళ్లు, హిందువుల మనో భావాలు దెబ్బ తినేలా వ్యాఖ్యానించారని, ఆయనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వవద్దని అఖిల భారత హిందూ మహాసభా వేదిక ఫిర్యాదు చేసింది. రామాయణాన్ని అవమానిస్తున్నారని, హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడుతున్నారని ఫిల్మ్‌ చాంబర్‌కు ఫిర్యాదు లేఖను అందించింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని, సినిమాల్లో అవకాశం కల్పించరాదని, ఒకవేళ ఇస్తే మున్ముందు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో రథోత్సవానికి ముంబై నుంచి హెలికాప్టర్ల ద్వారా ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్‌ మోడళ్లను పిలిపిస్తున్నారని ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. అంతే కాకుండా మేకప్‌ చేసి ఆ మోడళ్లతో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడి వేషాలు వేయిస్తున్నారని, ఘనంగా పూల స్వాగతం పలుకుతున్నారని, ఐఏఎస్‌ అధికారులు నమస్కరిస్తున్నారని, ఈ విధమైన చర్యలు దేశానికి ప్రమాదకరమని అన్నారు. చిన్న పిల్లలు అశ్లీల వీడియోలు చూస్తుంటే మౌనంగా ఎలా ఉంటామని, అదే విధంగా దేశానికి ప్రమాదకర విషయాలను ప్రశ్నించాల్సిందేనని చెప్పారు. ఈ వ్యాఖ్యలే పెద్ద దుమారం రేపాయి. ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. 

కామెంట్‌లు