ఉద్యోగుల్లో ఆనందం..జగన్ కు నీరాజనం
తెలంగాణలో కంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. భారీ మెజార్టీని కట్ట బెట్టిన ఆరాష్ట్ర జనానికి అడిగినవన్నీ చేసి పెడుతున్నారు ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటికే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే పనిలో పడ్డారు. అంతే కాకుండా పాలనా పరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీ తనం పెంచేలా చర్యలు చేపట్టారు. దీంతో పాటు ప్రజలు తమకు ఏవైనా ఇబ్బందులు ఉన్నా, సమస్యలు తలెత్తినా లేదా పరిష్కారం కాకా పోయినా వెంటనే తనకు నేరుగా ఫోన్ చేసే సౌకర్యాన్ని కల్పించారు.
మరో వైపు తన తండ్రి ప్రవేశ పెట్టిన ప్రజా దర్బార్ ను ఏర్పాటు చేశారు జగన్. దీంతో అవినీతి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే వెంటనే కేసు నమోదు చేయమని ఆదేశించారు జగన్ మోహన్ రెడ్డి. దీంతో అటు నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల్లో దడ మొదలైంది. ఆయా శాఖలపై పట్టు బిగించిన సీఎం ..ప్రజా ప్రతినిధులను, ఉన్నతాధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ తాను మాటల సీఎం ను కాదని, చేతల సీఎం నని చేసి చూపిస్తున్నారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 108, 104 సర్వీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు తీపి కబురు అందించారు జగన్.
వారి వేతనాలను పెంచేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 108, 104 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎంను కలసి వేతనాలు పెంచాలని విన్నవించారు. సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం 2 వేల మందికి పైగా పని చేస్తున్నారని, వీరిలో పైలెట్ కు ప్రస్తుతం 13 వేల వేతనం ఉండగా.. దాన్ని 28 వేలకు, ఈఎంటీ కి ప్రస్తుతం 15 వేలు వేతనం ఉండగా.. దాన్ని 30 వేలకు పెంచేందుకు హామీ ఇచ్చారని వారు తెలిపారు. అలాగే 104 వాహనాల్లో సుమారు 1,500 మంది ఉద్యోగులు ఉన్నారని, వీరిలో ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లకు 17,500 చొప్పున వేతనం ఉండగా, దాన్ని 28 వేలకు, డ్రైవర్‌కు 15,000 వేతనం ఉండగా, దానిని 26 వేలకు పెంచేందుకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారని చెప్పారు.
తాము సర్వీస్ ప్రొవైడర్ కింద పని చేయలేమని విన్నవించగా.. అందర్నీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే విధంగా చేస్తామని సీఎం చెప్పారని వెల్లడించారు. మేం గత 14 సంవత్సరాలుగా 108 వాహనాల్లో పని చేస్తున్నాం. మా కష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. మా సమస్యల పట్ల ఇంతటి సానుకూలంగా వ్యవహరించిన జగన్‌కు సదా కృతజ్ఞులమై ఉంటాం. మరింత మెరుగ్గా సేవలందించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి