నోట్ల రద్దు..ఇప్పుడు పసిడి వంతు


నిన్నటి దాకా నోట్ల రద్దుతో జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేసి బతుకు దెరువు లేకుండా చేసిన మోడీ ఇప్పుడు దేశంలో దాచుకున్న బంగారంపై కన్ను పడింది. బంగారాన్ని భారీగా దాచుకున్న వారి కోసం ప్రభుత్వం త్వరలో ఓ స్కీమును తేనుంది. నల్ల బంగారాన్ని తెల్లగా మార్చు కునేందుకు ఒక అవకాశం కల్పించాలని ఆలోచిస్తోంది. ఈ ప్రత్యేక స్కీము ద్వారా బంగారపు నిల్వలకు చట్ట బద్దత కల్పించాలనేది ప్రభుత్వ టార్గెట్‌‌. ఈ స్కీము రూపకల్పనలో ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖల అధికారులు నిమగ్నమై ఉన్నట్లు సమాచారం.

దాచు కున్న బంగారాన్ని బయట పెట్టి, దాని విలువ మీద పన్ను చెల్లిస్తే చాలు, ఆ బంగారం తెల్లదిగా మారి పోతుంది. వ్యక్తుల దగ్గర ఎంత పరిమితిలో బంగారం ఉండొచ్చనే అంశం మీద త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పరిమితికి మించిన బంగారపు నిల్వలను వెల్లడించి, ఆ విలువకు పన్ను చెల్లిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. స్కీము కాల పరిమితి ముగిశాక, ఎవరి దగ్గరైనా ఎక్కువ బంగారం ఉన్నట్లు బయట పడితే భారీగా ఫైన్స్‌‌ వేస్తారు. తాజా స్కీము కింద ఎంత పన్ను రేటు ఉంటుందనేది ఇంకా తెలియలేదు. కానీ, స్వచ్ఛందంగా ప్రకటించే స్కీములకు ఏ రేటైతే అమలులో ఉందో అదే రేటు ఉండొచ్చని అంచనా.

ప్రభుత్వం నియమించిన ఒక అప్రైజర్‌‌ బంగారం విలువను లెక్క గడతారు. పెళ్లైన ఆడవాళ్ల ఆభరణాల విలువ విషయంలో కొంత పరిమితి దాకా మినహాయింపు ఇవ్వనున్నారని సమాచారం. ఇండియా ఏటా 900 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటోంది. ఇందు కోసం సుమారు 2,50,000 కోట్లను దేశం వెచ్చిస్తోంది. ఇలా దిగుమతి చేసుకునే బంగారంలో ఎక్కువ శాతం సేఫ్‌‌ డిపాజిట్‌‌ లాకర్లలో పడి ఉంటున్నాయి. అంటే నిరుపయోగ ఆస్తిగా మిగిలి పోతున్నాయి. మరో వైపు దేశానికి ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యం వృధా అవుతోంది. ఇందు కోసం ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలోని ప్రతినిధులతో ఒక గోల్డ్‌‌ బోర్డ్‌‌ను నెలకొల్పనున్నారు.

కాగా గుళ్లు, ట్రస్ట్‌‌ల చేతిలో భారీ మొత్తంలో బంగారం నిల్వలున్నాయి. బహుశా ఈ బంగారం పరిమాణం వేల టన్నులలో ఉంటుంది. దేవుళ్లకు బంగారం ఇవ్వడం దేశంలో ఆచారంగా కొనసాగుతోంది. అలా వచ్చిన బంగారాన్ని జాగ్రత్తగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాకర్లలో  దాచి పెట్టడం దేవాలయాల బాధ్యత. కొత్త గోల్డ్‌‌ ప్లాన్‌‌ తెచ్చే విషయంలో కేబినెట్‌‌ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఒక వేళ ఇది పాస్ అవుతే అక్రమంగా దాచుకున్న వాళ్లకు ఇది బ్యాడ్ న్యూస్ అన్నమాట. 

కామెంట్‌లు