ఇక మాటల్లేవ్ ..మాట్లాడు కోవడాల్లేవ్

కార్మికులు తమంతకు తామే సెల్ఫ్ డిస్మిస్ అయ్యారు. ఇక వారితో మాటల్లేవ్ ...మాట్లాడు కోవడాలు లేవు. ఉన్నదల్లా ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేయడం, కొత్త వారిని నియమించు కోవడం మాత్రమే మిగిలి ఉంది. డోంట్ కేర్. జీతాలు ఇచ్చే సంస్థపై పోరాటమా, వారు అడిగినవన్నీ చేశాం. ఇక ఎలాంటి పరిస్థితుల్లో వారిని తీసుబోమని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్ . విలీనం డిమాండును వారే వదులుకున్నారు. ఇక వారితో చర్చలు ఎందుకు జరపాలంటూ ప్రశ్నించారు. రవాణా శాఖపై సమీక్ష చేపట్టారు. వెయ్యి అద్దె బస్సులకు నోటిఫికేషన్‌ వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశాన్ని పక్కనపెట్టి మిగిలిన 21 డిమాండ్లను పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే డిమాండ్‌ను కార్మిక సంఘాలు తమంతట తామే వదులు కున్నందున, దాన్ని పరిగణించాల్సిన అవసరం లేదని సీఎం తేల్చి చెప్పారు. ఆర్టీసీ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి రెండు మూడు రోజుల్లో నివేదిక అందించేలా చూడాలంటూ ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మను ఆదేశించారు. ఆ నివేదిక అందిన తర్వాత చర్చలపై తుది నిర్ణ యం తీసుకోనున్నారు. ఈనెల 28న జరిగే విచారణలో హైకోర్టుకు అదే విషయాన్ని నివేదించనున్నారు. ఆర్టీసీ సమ్మెపై విచారణ జరుపుతున్న హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సమ్మె పరిష్కారానికి సంబంధించి ఆర్టీసీ ఎండీకి కొన్ని సూచనలు చేసింది. హైకోర్టు ఉత్తర్వులు అందడంతో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తొలుత అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కార్మిక సంఘాలు చేసిన డిమాండ్లలో 21 అంశాలను కొత్తగా ఏర్పాటైన కమిటీ పరిశీలిస్తుంది. వాటి అమలు సాధ్యా సాధ్యాలపై పూర్తి వివరాలతో నివేదికను ఎండీకి అందజేస్తుంది. దాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతారు. ఆ నివేదికను పరిశీలించిన తర్వాతనే కార్మిక సంఘాలతో చర్చలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదంతా కోర్టు తదుపరి వాయిదా 28 లోపు జరగాల్సి ఉంది. కోర్టుకు ఆ రోజు తన నిర్ణయాన్ని ప్రభుత్వం వెల్లడిస్తుంది. అయితే సమ్మె పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. ఈడీ  వెంకటేశ్వర్‌రావు అధ్యక్షుడిగా ఈడీలు పురుషోత్తం, వినోద్‌ కుమార్, యాదగిరి,  వెంకటేశ్వర్లు, ఆర్థిక సలహాదారు  రమేష్‌లు సభ్యులుగా ఈ కమిటీ ఏర్పడింది. 

కామెంట్‌లు