సంస్కరణలకు శ్రీకారం..సామాన్యులకు అందలం


తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమూలమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నిన్నటి వరకు రాజకీయాలకు, బడా బాబులకు, డబ్బున్న మారాజులకు, పొలిటికల్ లీడర్లు, వీఐపీలకు పెద్దపీట వేస్తూ ..అడుగులకు మడుగులు వత్తుతూ తిరుమలను భ్రష్టు పట్టించారు.ఇదే సమయంలో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక వీటన్నింటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి తో పాటు పూర్తి పాలక మండలిని నియమించింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం విఐపీలకంటే సామాన్యులకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే ప్రక్షాళన షురూ అయ్యింది. సామాన్య భక్తులకు టీటీడీ పెద్దపీట వేస్తోంది.

వారికి పార దర్శకంగా గదులు కేటాయిస్తోంది. గదులు దొరకని భక్తులకు యాత్రికుల వసతి సముదాయాల్లో ఉచితంగా లాకర్‌ సౌకర్యం కల్పిస్తోంది. తిరుమల ఆర్టీసీ బస్టాండ్‌లో ఇటీవల అందు బాటులోకి పద్మనాభ నిలయంతో కలిపి మొత్తం 5 యాత్రికుల వసతి సముదాయాలున్నాయి. యాత్రికులు తమ సామగ్రిని ఇందులో భద్ర పరుచుకుని శ్రీవారి దర్శనానికి వెళ్లి రావచ్చు. తలనీలాల సమర్పణకు మినీ కల్యాణకట్ట, మరుగుదొడ్లు, స్నానపు గదులు, జల ప్రసాదం, అన్నప్రసాదం తదితర సౌకర్యాలు ఉన్నాయి. అద్దె గదులు దొరకని వారు పీఏసీల్లో సౌకర్యవంతంగా బస చేయవచ్చు. రిసెప్షన్‌ పరిధిలోని పీఏసీ–1, పీఏసీ–2, కౌస్తుభం, నందకం, జీఎన్‌సీ, పద్మావతి కౌంటర్, ఎస్వీ విశ్రాంతి గృహం, హెచ్‌వీసీ, సప్తగిరి విశ్రాంతి సముదాయాల వద్ద మినీ కల్యాణ కట్టలు ఉన్నాయి.

అన్ని వసతి గదులు, íపీఏసీల్లో భక్తులకు ప్రత్యేక కిట్‌లను ఇస్తోంది టీటీడీ. ఈ కిట్లలో చాపలు, దిండ్లు, దుప్పట్లు, ఉన్ని కంబళి ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో బస చేసే యాత్రికులు వీటిని అదనంగా పొందొచ్చు. సామాన్య భక్తులు వివాహాలు చేసుకునేందుకు వీలుగా వసతి కల్పన విభాగం పరిధిలో కల్యాణ మండపాలను వినియోగించుకోవచ్చు. ఇదిలా ఉండగా తిరుమలకు వచ్చే ప్రతి భక్తునికీ వసతి కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దళారీ వ్యవస్థ ఇక చెల్లదన్నారు. 

కామెంట్‌లు